hari krishna: మరి, మా పరిస్థితేమిటంటున్న హరికృష్ణ కారు ప్రమాద బాధితులు!
- మధ్య తరగతి కుటుంబాల వాళ్లం
- తిరిగి పనిలో చేరే వరకు మమ్మల్ని ఎవరు పోషిస్తారు?
- మమ్మల్ని పట్టించుకునే వారే కరవయ్యారు
- బాధితులు ప్రవీణ్, భార్గవ్, శివ ఆవేదన
నల్గొండ జిల్లాలో టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ కారు రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన తెలిసిందే. అన్నేపర్తి వద్ద హరికృష్ణ కారు డివైడర్ ను తాకుతూ ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఫొటోగ్రాఫర్లు శివ, భార్గవ్, ప్రవీణ్ లు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణతో పాటు ఈ ముగ్గురిని కూడా నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి వైద్యసదుపాయం కల్పించారు.
అయితే, హరికృష్ణ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలించిన తర్వాత ఆసుపత్రిలో ఉన్న తమను పట్టించుకునే వారే కరవయ్యారని వారు వాపోతున్నారు. ఈ ముగ్గురు ఫొటోగ్రాఫర్లు హైదరాబాద్ కు చెందిన వారే. ఈ ప్రమాదంలో తాము ప్రయాణిస్తున్న కారు, కెమెరాలు, ఇతర సామాగ్రి ధ్వంసమయ్యాయని, అప్పు చేసి కెమెరాలు కొనుగోలు చేశామని, ఆ వృత్తే తమ జీవనాధారమని బాధితులు చెప్పారు.
తాము మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్లమని, గాయాల నుంచి కోలుకుని తిరిగి పనిలో చేరే వరకు తమను ఎవరు పోషిస్తారని, తమను ఆసుపత్రిలో చేర్చిన అనంతరం పోలీసులు తమను పట్టించుకోవడం లేదని ప్రవీణ్, శివ చెప్పారు. తమ కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి వారు విఙ్ఞప్తి చేస్తున్నారు.