maha venkatesh: 'కేరాఫ్ కంచరపాలెం' గురించి శేఖర్ కమ్ముల
- వాస్తవ జీవితానికి అద్దం పట్టే కథ
- సహజత్వాన్ని ప్రతిబింబించే సన్నివేశాలు
- వచ్చేనెల 7వ తేదీన విడుదల
కథ .. పాత్రలు వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకునే దర్శకులలో శేఖర్ కమ్ముల ముందు వరుసలో ఉంటారు. ఆయన సినిమాలు మనసును తాకే విధంగా ఉంటాయి గనుకనే, భారీ విజయాలను అందుకుంటూ ఉంటాయి. అలాంటి శేఖర్ కమ్ముల మనసును సైతం ఒక సినిమా గెలుచుకుంది .. ఆ సినిమాయే 'కేరాఫ్ కంచరపాలెం. ప్రవీణ పరుచూరి నిర్మించిన ఈ సినిమాకి మహా వెంకటేశ్ దర్శకత్వం వహించాడు.
విశాఖ సమీపంలోని 'కంచరపాలెం' నేపథ్యంలో సాగే కథ ఇది. వచ్చేనెల 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా స్పెషల్ షో చూసిన శేఖర్ కమ్ముల మాట్లాడుతూ .. "మన చుట్టూ వున్న జీవితాలు .. మనం పట్టించుకోని సంఘటనలు .. ఈ సినిమాలో ఎంతో సహజంగా ఆవిష్కరించారు. ప్రతి పాట .. ప్రతి మాటలోను హృదయాన్ని తాకే శక్తి కనిపిస్తుంది. దర్శకుడిగా మహా వెంకటేశ్ ఈ సినిమాలోని పాత్రలను మలచిన తీరు అద్భుతం అనిపిస్తుంది .. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఎంతో అవగాహనతో .. బాధ్యతతో రూపొందించిన సినిమా" అంటూ ఆయన ఈ సినిమా టీమ్ కి అభినందనలు తెలియజేశారు.