Harikrishna: 'వస్తానో రానో' అన్నాడు.. ఎందుకన్నాడో ఆ మాట!: హరికృష్ణ మాటలు గుర్తు చేసుకున్న చిరకాల మిత్రుడు
- మంగళవారం పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు వెళ్లిన భగ్గు హన్మంతరావు
- ఆహ్వానం హోటల్ లో కలిసిన ఇద్దరు మిత్రులు
- తలచుకుని కన్నీటి పర్యంతమైన హన్మంతరావు
"వస్తానో రానో.. ఉంటే మాత్రం తప్పకుండా వస్తా..." మంగళవారం నాడు తనను కలిసి, పెళ్లి కార్డు ఇచ్చిన చిన్ననాటి మిత్రుడు, సికింద్రాబాద్ కు చెందిన భగ్గు హన్మంతరావుతో హరికృష్ణ చెప్పిన మాటలివి. ఆయనిప్పుడు మన మధ్య లేరని తెలిసిన తరువాత, "ఎందుకన్నాడో ఆ మాట" అంటూ హన్మంతరావు కన్నీటి పర్యంతమయ్యారు. హరికృష్ణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన, 38 సంవత్సరాలుగా ఆయన తనకు మిత్రుడని చెప్పారు.
మంగళవారం మధ్యాహ్నం హరికృష్ణను కలిసేందుకు ఆహ్వానం హోటల్ కు వెళ్లానని, తనను చూడగానే కుశల ప్రశ్నలు వేశారని గుర్తు చేసుకున్నారు. పెళ్లి కార్డును చూస్తూ "వివాహం ఎప్పుడు?" అని అడిగితే, "మీ పుట్టిన రోజునాడే" అన్నానని చెప్పారు. ఆ వెంటనే "నేను ఉంటానో లేదో... ఉంటే మాత్రం తప్పకుండా వస్తాను" అని అన్నారని తెలిపారు. కాగా, 1999లో హరికృష్ణ 'అన్న తెలుగుదేశం' పార్టీ తరఫున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి భగ్గు హన్మంతరావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి, ఆయన గెలుపు కోసం ప్రచారం కూడా చేశారు.