Ramnath Kovind: కేసీఆర్ సాధించారు... కొత్త జోన్లకు కోవింద్ ఆమోదం!
- 31 జిల్లాలు, ఏడు జోన్లకు ఆమోదం
- ఉత్తర్వుల కోసం సచివాలయంలోనే ఎస్కే జోషి
- నేడో, రేపో రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్
తెలంగాణలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా పెంచడం, ఆపై ఉద్యోగ నియామకాల్లో రెండు జోన్లు, ఒక మల్టీజోన్ గా ఉన్న రాష్ట్రాన్ని ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా మార్చాలని తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారని తెలుస్తోంది. గత వారంలో ప్రధాని నరేంద్ర మోదీతో జోన్ల ఆమోదం కోసం సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్, తాను అనుకున్నది సాధించారు.
ఈ మొత్తం ప్రక్రియను చక్కబెట్టేందుకు ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ గత రెండు వారాలుగా ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి సంతకం పెట్టిన కాపీని తీసుకున్న తరువాతనే హైదరాబాద్ రావాలన్న ఉద్దేశంతో రాజీవ్ శర్మ ఢిల్లీలోనే ఉన్నారు. ఇక రాష్ట్రపతి సంతకం పెట్టిన ఉత్తర్వులు తనకు అందితే తదుపరి నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనలో బుధవారం రాత్రి పొద్దుపోయేవరకూ సెక్రటేరియేట్ లోనే ఉండిపోయారని తెలుస్తోంది. ఉత్తర్వులు అందగానే జిల్లాల పునర్వ్యవస్థీకరణ, జోన్ లపై రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది.