Chennai: రైలులో ప్రయాణికుడిని కొరికిన ఎలుక.. రూ.32 వేలు పరిహారం ఇవ్వాలన్న కోర్టు!

  • రైలు ప్రయాణంలో పీఎంకే నేతకు చేదు అనుభవం
  • నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన టీసీ
  • తీవ్ర మానసిక వేదన అనుభవించిన బాధితుడు

రైలులో ఎలుక కొరకడంతో గాయపడిన ఓ ప్రయాణికుడికి రూ.32 వేలు చెల్లించాల్సిందిగా వినియోగదారుల ఫోరం రైల్వేను ఆదేశించింది. 2014లో సేలం నుంచి చెన్నై ఎగ్మూరు వెళ్లే రైలులో పీఎంకే నేత వెంకటాచలం (40) ప్రయాణించారు. ప్రయాణంలో తన కాలును ఎలుక కొరకడంతో టీసీకి ఫిర్యాదు చేశారు. ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో చెన్నై ఎగ్మూరు చేరుకున్న తర్వాత ఫిర్యాదు స్వీకరణ పెట్టలో తన ఫిర్యాదు పత్రాన్ని వేశారు. చికిత్స అనంతరం ఆయన సేలం వినియోగదారుల ఫోరంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఎలుక కొరకడం వల్ల తాను తీవ్ర మానసిక వేదన అనుభవించానని, రైల్వే అధికారుల నిర్లక్ష్యం తనను మరింత వేదనకు గురిచేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును విచారించిన ఫోరం తాజాగా తీర్పు వెల్లడించింది. మానసిక క్షోభకు రూ.25వేలు, వైద్య ఖర్చులకు రూ.2 వేలు, కేసు ఖర్చులకు మరో రూ.5 వేలు కలిపి మొత్తం రూ.32 వేలను బాధితుడికి చెల్లించాల్సిందిగా రైల్వే శాఖను ఆదేశించింది. నిర్ణీత సమయంలో డబ్బులు చెల్లించకుంటే అదనంగా 9 శాతం వడ్డీతో పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి చెల్లించాల్సి వస్తుందని ఫోరం హెచ్చరించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News