Amma baba: మంత్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ‘అమ్మబాబా’ అరెస్ట్
- ‘అమ్మ బాబా’గా అవతారమెత్తిన స్రవంతి
- మంత్రాలతో ధనప్రాప్తి కల్పిస్తానని మోసం
- అరెస్ట్ చేసిన పోలీసులు
తన మంత్రాలు, మాయలతో సంతాన భాగ్యం కల్పిస్తానని, అనారోగ్యాన్ని నయం చేస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న ‘అమ్మబాబా’ను పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలేనికి చెందిన అమ్మబాబా (నారదాసు స్రవంతి-36)ను బుధవారం కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌లోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉంటున్న స్రవంతి ‘అమ్మబాబా’గా మారి తనకు మంత్రాలు వచ్చంటూ అందరినీ నమ్మించింది.
ధన ప్రాప్తి కల్పిస్తానని, రోగాలను నయం చేస్తానని చెప్పడంతో నమ్మిన గ్రామీణులు ఆమెకు వేలల్లో డబ్బులు సమర్పించుకున్నారు. అయితే, ఆమె చెప్పిన దాంట్లో ఏదీ జరగకపోవడంతో ‘అమ్మబాబా’ తమను మోసం చేసిందని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి రూ.7,300 నగదు, తాయెత్తులు, త్రిశూలం, పూజ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.