hari krishna: ‘హరన్నా!’ అని పిలిస్తే .. ‘కాలవ గారూ!’ అని పిలిచే ఆ గొంతు మూగబోయింది: మంత్రి కాలవ
- పెద్దాయన ప్రతిరూపం మాయమైంది
- ఆ కుటుంబాన్ని ఓదార్చేందుకు మాటలు రావట్లేదు
- హరన్నకు నివాళిగా అక్షరాంజలి ఘటిస్తున్నా
‘కాలవ గారూ’ అని ఇప్పుడు తనను పిలిచేదెవరు? ఆ గంభీరస్వరం పలికే ఆత్మీయ పలకరింపులు ఎక్కడ? అంటూ నందమూరి హరికృష్ణ గురించి ఏపీ మంత్రి కాలవ శ్రీనివాసులు గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
‘తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశాలలో నా పక్కనే కూర్చునే సహసభ్యుడు ఇక సమావేశాలకు శాశ్వత సెలవు తీసుకున్నారు. పక్కన హరి అన్న కూర్చుంటే కొండంత అండలా ఉండేది. అన్న అనంత లోకాలకేగాడు. ఎప్పుడు కలిసినా, పలకరించినా నా రాయలసీమ ఊసులు, బాసలే. నా రతనాల సీమను ఇంతగా ప్రేమించి.. శ్వాసించిన హరి అన్న ఊపిరి ఆగిపోయింది. ఇప్పుడు నా రాయలసీమ ఊసులు ఎవరడుగుతారు? మా ప్రాంతీయుల బాగోగులు ఎవరు ఆరా తీస్తారు? తండ్రి నందమూరి తారకరామారావుకు రాయలసీమ అంటే ఎంతిష్టమో! హరి అన్నకు అంతే ఇష్టం. నాతో మాటలు కలిపిన ప్రతీసారీ మా ప్రాంతం, ప్రజలు ఎలా ఉన్నారని అడిగే అన్న..ఇక ఎన్నటికీ రాడని తెలిసి ఎలా తట్టుకోగలను?’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
అది 2008 సంవత్సరం. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ‘మీ కోసం’ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఇటు చంద్రబాబు, అటు హరికృష్ణ కూర్చున్నారు. మధ్యలో నేను. పార్టీలో కేడర్ నుంచి లీడర్ వరకూ అందరినీ తమ కుటుంబ సభ్యుల్లా భావించే నందమూరి, నారా కుటుంబాలు నా పాలిట దేవుడిచ్చిన బంధువులు. వారి మధ్యన కూర్చున్న ఆ నాటి చిత్రం ఇంకా నా మదిలో మెదులుతోంది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సైకిల్ యాత్ర చేపట్టింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 750 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రను తాడిపత్రిలో నందమూరి హరికృష్ణ ప్రారంభించారు. ఇది మరపురాని సంఘటన.
పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పార్టీ అగ్రనాయకుడిగా, ఆత్మీయ బంధువుగా హరి అన్నతో ఎన్నో కార్యక్రమాలలో పాలుపంచుకున్నాను. ఇప్పుడు హరి అన్న లేడు. ఆయనతో జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఎప్పటికీ ఉంటాయి. తెలుగుజాతి ఆత్మగౌరవ పతాక అన్నగారి తనయుడిగా మనందరికీ పరిచయం అయినా ..నందమూరి హరికృష్ణ విభిన్నరంగాలలో తనదంటూ ఓ ముద్ర వేసిన ప్రత్యేక వ్యక్తి. అన్న నందమూరి తారకరామారావు చైతన్యరథానికి సారధిగా.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా, హిందూపురం శాసనసభ్యుడిగా, రవాణా మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా హరికృష్ణ నిర్వర్తించిన పదవులు, పాత్రలు ఒక చరిత్ర. ఒక అధ్యాయం ముగిసింది.
పెద్దాయన ప్రతిరూపం మాయమైంది. ఇప్పుడు నేను ‘హరన్నా!’ అని పిలిస్తే .. మర్యాదపూర్వకంగా..ఆప్యాయంగా ‘కాలవ గారూ!’ అని పిలిచే ఆ గొంతు మూగబోయింది. కలలో కూడా ఊహించలేని విషాదం ఇది. హరి అన్న లేని లోటు వ్యక్తిగతంగా నాకు తీరనిది. హరన్న కుటుంబాన్ని ఓదార్చేందుకు మాటలు కూడా రావడంలేదు. నందమూరి హరికృష్ణ మృతితో శోకసంద్రంలో మునిగిన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. హరన్నకు నివాళిగా అక్షరాంజలి ఘటిస్తున్నాను’ అని కాలవ తన ప్రకటనలో పేర్కొన్నారు.