Anantapur District: మెడకు చున్నీ బిగించుకుని, పెళ్లి చేసుకోవాలని బెదిరించిన ప్రియుడు... చున్నీని గట్టిగా లాగి హత్య చేసిన ప్రియురాలు!

  • అనంతపురం జిల్లా మడకసిర సమీపంలో ఘటన
  • ప్రియురాలిని బెదిరించాలని ఆమె అక్క చున్నీని మెడకు చుట్టుకున్న మోహన్
  • అక్కతో కలసి మోహన్ ను హత్య చేసిన మమత

తనను ప్రేమించి, మరొకరితో పెళ్లికి సిద్ధమైన ప్రియురాలిని బెదిరించాలని ఆ యువకుడు చేసిన ప్రయత్నం అతని ప్రాణాలు తీసింది. ప్రేమించినప్పటికీ, మద్యానికి బానిసై పాడైపోయిన అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని ఆ యువతి, తన అక్క సాయంతో అతన్ని తన చున్నీతోనే హతమార్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లా, మడకసిర సమీపంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఉపాధి హామీ పనులను పర్యవేక్షించే మోహన్‌ అనే వ్యక్తి, ఈ నెల 5న అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. మోహన్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, తమకు అనుమానం ఉన్న మోహన్ ప్రియురాలిని విచారించారు. ఈ క్రమంలో వారు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు.

రొళ్ల మండలం ఎం రాయపురానికి చెందిన మమత అనే యువతితో మోహన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరివీ ఎదురెదురు ఇళ్లే. తనను పెళ్లి చేసుకోవాలని మమతను మోహన్ తరచూ అడుగుతుండేవాడు. ఈ క్రమంలో మద్యం తాగి వచ్చి ఆమెతో ఘర్షణకు దిగుతుండేవాడు. ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ యువకుడితో మమత వివాహం నిశ్చయమైంది. 5వ తేదీ రాత్రి మోహన్‌ పెళ్లి విషయమై మరోసారి ఆమెతో గొడవపడ్డాడు. నువ్వు లేకుండా బతకలేనని చెబుతూ, పెళ్లికి ఇష్టపడకుంటే చంపేయాలని కోరుతూ, పక్కనే ఉన్న మమత సోదరి పవిత్ర చున్నీని తీసుకుని గొంతుకు చుట్టుకున్నాడు.

అప్పటికే అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన వారిద్దరూ, అదే చున్నీని గట్టిగా పట్టుకుని లాగారు. దీంతో గొంతు బిగుసుకుపోయి, ఊపిరాడక మోహన్ మృతిచెందాడు. ఆపై అతని మృతదేహాన్ని తీసుకెళ్లి, అతని ఇంటి ముందు పడేశారు. వీరిద్దరి విచారణ తరువాత కేసులో చిక్కుముడులను విప్పిన పోలీసులు, నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. పవిత్రకు మూడు నెలల పాప ఉండగా, జైలుకు తన బిడ్డను కూడా ఆమె తీసుకెళ్లడంతో, అన్నెం పున్నెం ఎరుగని బిడ్డ జైల్లో పెరగాల్సి వస్తోందని స్థానికులు కంటతడిపెట్టారు.

Anantapur District
Lover
Mamata
Died
Mohan
Chunney
  • Loading...

More Telugu News