Posani Krishna Murali: సినిమా ఫ్లాపయితే డబ్బులు వద్దు.. పార్టీ ఇస్తే చాలన్నారు!: హరికృష్ణ మంచితనం గురించి పోసాని
- హరితో నాది గొప్ప అనుబంధం
- నన్ను ప్రేమగా పోసానీ అని పిలిచేవారు
- ఆవులంటే చాలా ఇష్టమన్న పోసాని
ప్రముఖ నటుడు హరికృష్ణ మరణంపై కథారచయిత పోసాని కృష్ణమురళి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హరి దాదాపు 10 సినిమాల్లో నటిస్తే వాటిలో 8 సినిమాలకు తానే కథా, కథనం రాశానని గుర్తుచేసుకున్నారు. హరికృష్ణతో తనకు మంచి అనుబంధం ఉందనీ, ఆయన తమ ఇంటికి వచ్చి కూర్చుని టీ తాగేవారని పోసాని చెప్పారు. ఒకరిని మోసం చేయడం, నాశనం చేయాలన్న తలంపు హరికృష్ణకు లేవన్నారు.
హరికృష్ణ తనకు 25 ఏళ్లుగా తెలుసని పోసాని అన్నారు. ప్రస్తుతం తాను పనిమీద గోవాకు వచ్చి చిక్కుకుపోయాననీ, లేదంటే హరిని చూసేందుకు వెంటనే వెళ్లేవాడినని వ్యాఖ్యానించారు. ‘శ్రావణ మాసం’ సినిమాకు హరికృష్ణకు తాను రూ.2 లక్షలు బాకీ పడ్డానని పోసాని చెప్పుకొచ్చారు.
ఓసారి ఆయన ఇంటికి వెళ్లగా ‘ఏమోయ్.. డబ్బులు ఎప్పుడు ఇస్తావ్?’ అంటూ హరికృష్ణ అడిగారనీ, తాను వెంటనే ‘అన్నా సినిమా ఫ్లాపయింది. మిగిలిన డబ్బులు నెల రోజుల్లో ఇచ్చేస్తా’ అని చెప్పానని, దీంతో హరికష్ణ వెంటనే స్పందిస్తూ.. ‘డబ్బులొద్దు.. ఏం వద్దు.. ముందు టీ ఇవ్వు.. ఆ తర్వాత ఓ పార్టీ ఇచ్చేయ్’ అని చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
తనను హరికృష్ణ పోసాని అంటూ ప్రేమగా పిలిచేవారనీ, వ్యక్తిత్వంలో ఆయన తండ్రి ఎన్టీఆర్ కంటే గొప్ప వ్యక్తి అని పోసాని కీర్తించారు. షూటింగ్ 8 గంటలకు ఉందంటే.. హరి స్పాట్ కు ఆరు గంటలకు వచ్చేసేవారని వెల్లడించారు. హరికృష్ణకు గోవులంటే చాలా ఇష్టమని వ్యాఖ్యానించారు.