varavararao: ఆయనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం: వరవరరావు భార్య హేమలత

  • నా భర్తను ఎన్నోసార్లు పోలీసులు అరెస్టు చేశారు 
  • కానీ, ఈ తరహా పరిస్థితిని నేనెప్పుడూ చూడలేదు
  • తనిఖీలంటూ పోలీసులు ఇల్లంతా చిందరవందర చేశారు

ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణల నేపథ్యంలో విరసం నేత వరవరరావుని పూణె పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై వరవరరావు భార్య హేమలత మీడియాతో మాట్లాడుతూ, గత నలభై ఏళ్లలో ఆయనపై అనేక కేసులు నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.

ఈ తరహా పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. వరవరరావుని ఎన్నోసార్లు పోలీసులు అరెస్టు చేశారని, అయితే, ఎప్పుడూ కూడా మా ఇంటి గుమ్మం దాటి వాళ్లు లోపలికి రాలేదని, చాలా మర్యాదగా ‘అరెస్టు చేస్తున్నాం సార్’ అని చెప్పి తీసుకెళ్లేవారని, ఈసారి మాత్రం ఇంట్లోకి వచ్చి.. తనిఖీలు చేయడం ఫస్ట్ టైమ్ అని అన్నారు. వరవరరావుపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన భార్య హేమలత అన్నారు.

సుమారు ఎనిమిది గంటలపాటు సోదాలు నిర్వహించారని, సెల్ ఫోన్లు, కొన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లారని  చెప్పారు. ఇరవై మంది పోలీసులు వచ్చి తమ ఇంట్లో సోదాలు చేశారని, ఇల్లంతా చిందర వందర చేశారని అన్నారు. వరవరరావు ఫోన్ తో పాటు తన ఫోన్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ తీసేశారని, తమ ఆధార్ కార్డులను కూడా తీసుకెళ్లారని చెప్పారు. 

తమ ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాను పోలీసులు తనకు అందజేశారని, సుమారు ఎనిమిది గంటలకు పైగా తనిఖీలు చేసిన పోలీసులు ఏమీ తినకుండా ఉండడంతో, తానే టీ చేసి ఇచ్చినట్టు హేమలత చెప్పారు.
తన భర్తను అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు చివరి నిమిషంలో ప్రకటించారని అన్నారు. ఈ మధ్య కాలంలో తన భర్త ఆరోగ్యం బాగా లేదన్న విషయాన్ని పోలీసులకు తాను చెప్పగా, వైద్య చికిత్స చేయిస్తామని వారు చెప్పినట్టు వరవరరావు భార్య హేమలత పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News