Supreme Court: మతాంతర ప్రేమ వివాహం కేసు: తల్లిదండ్రుల దగ్గరే ఉంటానన్న యువతి.. ఆమె ఇష్టమన్న సుప్రీంకోర్టు!
- భార్య నిర్బంధంపై సుప్రీంను ఆశ్రయించిన భర్త
- తాను ఇష్టపూర్వకంగానే వెళ్లానన్నయువతి
- ఆమె అభీష్టాన్నిగౌరవించిన కోర్టు
తన భార్యను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారంటూ అర్యన్ ఆర్య అనే ఛత్తీస్ గఢ్ యువకుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సదరు యువతి తాను తల్లిదండ్రులతోనే ఉంటాననీ, భర్త వద్దకు వెళ్లనని సోమవారం న్యాయస్థానానికి చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో యువతి వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఆమె తన తల్లిదండ్రులతోనే ఉండొచ్చని తీర్పు ఇచ్చింది.
ఛత్తీస్ గఢ్ కు చెందిన ఇబ్రహీం సిద్దిఖీ అనే యువకుడు జైన మతానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవడం కోసం మతం మారడంతో పాటు ఆర్యన్ ఆర్యగా పేరు మార్చుకున్నాడు. అయితే యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆమె ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేందుకు యత్నించింది. కానీ యువతి తండ్రికున్న రాజకీయ పలుకుబడి కారణంగా మార్గమధ్యంలోనే పోలీసులు ఆమెను అడ్డుకుని తండ్రి వద్దకు చేర్చారని సదరు యువకుడు ఫిర్యాదు చేశాడు.
కింది కోర్టులో తనకు న్యాయం జరగకపోవడంతో ఆర్యన్ ఆర్య సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన భార్యను ఆమె తల్లిదండ్రుల నిర్బంధం నుంచి విడిపించాలని కోరాడు. దీంతో యువతిని తమముందు హాజరుపరచాలని సుప్రీం పోలీసులను ఆదేశించింది. ఒకవేళ యువతి తల్లిదండ్రులతో వెళతానని కోరుకుంటే పిటిషన్ ను కొట్టేస్తామని న్యాయస్థానం అప్పట్లోనే ఆర్యకు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో సోమవారం కోర్టు ముందు హాజరైన యువతి తాను తన తల్లిదండ్రులతోనే ఉంటానని తేల్చిచెప్పింది. ఆర్యన్ ఆర్యను తాను ప్రేమ వివాహం చేసుకున్నాననీ, కానీ ఇప్పుడు అతనితో కలసి ఉండాలని లేదని వెల్లడించింది. ఇందులో ఎవ్వరి బలవంతం లేదనీ, తాను ఇష్టపూర్వకంగానే తల్లిదండ్రులతో ఉండాలనుకుంటున్నట్లు పేర్కొంది. యువతి వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపింది.