Vijayawada: విజయవాడలో ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. కడుపు నొప్పి అని వెళితే పిచ్చోడిని చేసి పంపారు!
- కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన యువకుడు
- ఆపరేషన్ చేస్తే మతి స్థిమితం కోల్పోయిన వైనం
- మత్తు మందు అధిక మొత్తంలో ఇవ్వడమే కారణం
ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకంతో ఓ యువకుడు మతిస్థిమితం కోల్పోయిన ఘటన విజయవాడలో జరిగింది. కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన యువకుడిని వైద్యులు పిచ్చోడిని చేసి పంపించారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన బాజీ కడుపు నొప్పితో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ఈ నెల 26న వైద్యులు అతడికి ఆపరేషన్ చేశారు. అయితే, ఆపరేషన్ వికటించడంతో అతడు మతిస్థిమితం కోల్పోయాడు. దీంతో వైద్యులు అతడిని అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చేతులు దులుపుకున్నారు.
ఆపరేషన్ సమయంలో అనెస్తీషియా అధిక మోతాదులో ఇవ్వడం వల్లే అతడు మతిస్థిమితం కోల్పోయినట్టు గుంటూరు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాజీ పరిస్థితి విషమంగా ఉందని, ఈ పరిస్థితుల్లో మరో శస్త్రచికిత్స చేయడం కుదరదని తేల్చి చెప్పారు. కాగా, బాజీ మతిస్థిమితం కోల్పోవడానికి కారణమైన ప్రైవేటు ఆసుపత్రిపై అతడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.