KSRTC: బెంగళూరు నుంచి తిరుపతికి నడిచే ఈ కొత్త బస్సు సూపరో సూపరు!
- బస్సులోనే కిచెన్, టాయిలెట్
- ప్రతి సీటు వెనుకా 70 చానళ్లు వచ్చేలా టీవీ
- వైఫై సదుపాయం కూడా
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి అత్యాధునిక వసతులతో కూడిన లగ్జరీ బస్సులు ప్రారంభం అయ్యాయి. కేఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ బస్సుల్లో అందించే సేవలు అద్భుతమంటున్నారు ప్రయాణికులు. రోజూ ఉదయం, రాత్రి 10 గంటలకు బయలుదేరే బస్సులు ఆ తరువాత ఐదు గంటలకు తిరుపతికి చేరుకుంటాయి. ఆ వెంటనే తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకునేందుకు వీలుగా బస్సులు నడుపుతామని అధికారులు తెలిపారు. ఈ బస్సులు తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి రాత్రి 11 గంటలకు, ఉదయం 9 గంటలకు బయలుదేరి బెంగళూరుకు వెళతాయి.
ఇక ఈ బస్సు ప్రత్యేకతలను పరిశీలిస్తే, ఇందులో కెమికల్ టాయిలెట్, ప్యాంట్రీ ఉంటాయి. ప్రతి సీటు వెనుకా 70 చానళ్లు వచ్చే టీవీ అమర్చి ఉంటుంది. బస్సులోనే అల్పాహారం, స్నాక్స్ అందిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ధరనేమీ వసూలు చేయరు. టికెట్ రేటులోనే స్నాక్స్ తదితరాలకూ ధర కలిపే ఉంటుంది. వైఫై సదుపాయం అదనపు ఆకర్షణ. మిగతా లగ్జరీ బస్సులతో పోలిస్తే, కాళ్లు చాపుకునేందుకు జాగా కూడా ఎక్కువే. ఇక ఈ బస్సులకు వచ్చే స్పందన బట్టి మరిన్ని బస్సులను నడిపిస్తామని అధికారులు అంటున్నారు.