Nepal: నేపాల్ విమాన ప్రమాదానికి కారణం వెల్లడి.. ఘటనకు ముందు విపరీతంగా ఏడ్చేసిన పైలట్!
- ప్రమాదంలో 51 మంది మృతి
- పైలట్-కోపైలట్ మధ్య వాగ్వాదం
- నాన్-స్టాప్‌గా సిగరెట్లు తాగిన కెప్టెన్
- వెల్లడించిన దర్యాప్తు నివేదిక
ఈ ఏడాది మార్చి 12న నేపాల్‌లోని కఠ్మండూ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదానికి గల కారణం బయటకొచ్చింది. ఈ ప్రమాదంలో 51 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించిన అధికారులు పైలట్ మానసిక ఒత్తిడే ప్రమాదానికి కారణమని తేల్చారు. తీవ్ర ఒత్తిడికి లోనైన పైలట్ పదేపదే సిగరెట్లు తాగాడని, పలుమార్లు ఏడ్చేశాడని నివేదిక పేర్కొంది.
బంగ్లాదేశ్ నుంచి నేపాల్ బయలుదేరిన యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్స్ విమానంలో పైలట్ అబిద్ సుల్తాన్, మహిళా కో-పైలట్ ప్రీతులా రషీద్ ఉన్నారు. ప్రమాదానికి గురైనప్పుడు విమానాన్ని ప్రీతులా నడుపుతున్నారు. మరికాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా విమానం ఒక్కసారిగా దిశమార్చుకుంది. ఈ క్రమంలో వేగాన్ని నియంత్రించడంలో విఫలం కావడంతో పక్కనే ఉన్న ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సహా 51 మంది మృతి చెందగా 20 మంది తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు.
కో-పైలట్ ప్రీతులా-పైలట్ సుల్తాన్ మధ్య ప్రయాణంలో వాగ్వాదం జరిగినట్టు కాక్‌పిట్ వాయిస్ రికార్డరు ద్వారా తెలుస్తోందని నివేదిక పేర్కొంది. పనిచేస్తున్న ఎయిర్‌లైన్స్‌కే శిక్షకుడిగా ఉన్న సుల్తాన్ పనితీరును ప్రీతులా ప్రశ్నించడంతో అతడు మానసిక ఒత్తిడికి గురయ్యాడని, ఆమెతో వాదులాటకు దిగాడని నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో అతడు కాక్‌పిట్‌లో నాన్-స్టాప్‌గా సిగరెట్లు తాగాడని, పలుమార్లు ఏడ్చేశాడని నివేదికలో పేర్కొన్నారు. ఒకానొక సందర్భంలో విమానం భద్రత గురించి తాను పట్టించుకోబోనని, నువ్వు నీ డ్యూటీ చేసుకోవాలని కో- పైలట్‌కు సుల్తాన్ తేల్చి చెప్పాడు. దీంతో ఆమె ఏకాగ్రత చెదిరిందని, ఫలితంగా ప్రమాదం చోటుచేసుకుందని నివేదిక వివరించింది.