tulasireddy: 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ: తులసిరెడ్డి
- ‘‘వ్యవసాయం దండగ కాదు..పండగ’’ అని నిరూపిస్తాం
- బీజేపీ, టీడీపీ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది
- ఉపాధి హామీ పధకాన్ని వ్యవసాయ రంగంలో అనుసంధానం చేస్తాం
కాంగ్రెస్ పాలనలో హరిత విప్లవం, క్షీర విప్లవం తీసుకురాగా, బీజేపీ, టీడీపీ పాలనలో అవినీతి విప్లవం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడు డాక్టర్ ఎన్.తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఈరోజు మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని గతంలో కేంద్రంలోని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలను అమలు చేశాయని అన్నారు.
నెహ్రు, శాస్త్రి, ఇందిరాగాంధీ అమలు చేసిన హరిత విప్లవం కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఐదు రెట్లు పెరిగిందన్నారు. దేశం స్వయం సమృద్ది సాధించడమే కాక ఎగుమతి చేసే స్థాయికి చేరిందన్నారు. 1970లో ఇందిరాగాంధీ ప్రారంభించిన క్షీర విప్లవం ద్వారా పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నెంబర్1 స్థానానికి చేరిందన్నారు. పండ్లు, కాయగూరలు, గోధుమ, బియ్యం ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే 2వ స్థానానికి చేరిందన్నారు.
2008వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా రూ.70000 కోట్ల మేరకు రైతు రుణమాఫీ చేయడమైందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.12000 కోట్ల మేరకు రైతుల రుణమాఫీ జరిగిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు శ్రీశైలం డ్యామ్, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీను నిర్మించి ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణను చేశాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగిందన్నారు.
బీజేపీ, టీడీపీ రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. రూ.87612 కోట్లు మాఫీ చేయవలసి ఉండగా, వివిధ షరతులు పెట్టి చివరకు రూ.24000 కోట్లు మాఫీ చేస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు రూ.14361 కోట్లు మాత్రమే మాఫీ జరిగిందన్నారు. బీజేపీ, టీడీపీ పాలనలో అవినీతి విప్లవం జరిగిందని ఎద్దేవా చేశారు.
2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2008లో చేసిన మాదిరిగానే దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ పధకాన్ని అమలు చేస్తామని, ఉపాధి హామీ పధకాన్ని వ్యవసాయ రంగంలో అనుసంధానం చేస్తామని, కిసాన్ మరియు కృషి మజ్దూర్ సంక్షేమ ఆయోగ్ ఏర్పాటు చేసి, దానికి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి రైతు, రైతు కూలీలకు సామాజిక భద్రత కల్పిస్తామని ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు తులసిరెడ్డి గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టుతో పాటు అసంపూర్ణంగా ఉన్న అన్ని ప్రాజెక్టులను సంవత్సరం లోపు పూర్తి చేసి ‘‘వ్యవసాయం దండగ కాదు.. పండగ’’ అని నిరూపిస్తామన్నారు. రైతన్నల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలసిన చారిత్రిక ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా తులసిరెడ్డి అన్నారు.