jagapathibabu: నా పరిస్థితి బాగోలేనప్పుడు ఎవరూ మాట సాయం కూడా చేయలేదు: జగపతిబాబు
- డబ్బుకోసం పాకులాడను
- నాకు రావలసి వుంటే వస్తుంది
- సాయపడటంలో ఆనందం వుంటుంది
జగపతిబాబు గురించి తెలిసినవాళ్లు .. ఆయనను దగ్గర నుంచి చూసిన వాళ్లు 'ముక్కుసూటి మనిషి' అని చెబుతారు. ఎవరు ఎలాంటి సాయం అడిగినా ఆలోచించకుండా చేస్తారని అంటారు. అందువలన ఆయన కొంత నష్టపోయారని కూడా చెబుతారు. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ విషయాన్ని గురించే జగపతిబాబు స్పందించారు.
"నేను డబ్బుకి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వను. డబ్బులు ఉన్నది దాచుకోవడానికి మాత్రమే కాదు .. కష్టాల్లో వున్న వారికి సాయపడటానికి కూడా అనేది నా అభిప్రాయం. ఎవరికైనా డబ్బులు ఇస్తున్నప్పుడే అది నాది కాదు అనుకుంటాను. కొంతమంది ఆపదలో వుండి అడిగినప్పుడు .. వాళ్లు తిరిగి ఇవ్వలేరని తెలిసి కూడా సాయం చేస్తాను. రావలసి వుంటే వస్తుంది అనేది నేను నమ్ముతాను .. అది నిజమైంది కూడా.
ఇతరులకు సాయం చేసే స్థితిలో ఉండటాన్ని ఒక అదృష్టంగా భావిస్తాను .. అందులో నాకెంతో సంతోషం లభిస్తుంది కూడా. ఒక్కోసారి నాకే అవసరమై హెల్ప్ అడిగిన సందర్భాలు వున్నాయి. అప్పుడు నాకు మాట సాయం చేసిన వాళ్లు కూడా దాదాపుగా లేరు .. అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు. ఒకప్పుడు ఉన్నవాళ్లకి కూడా డబ్బులు ఇచ్చాను .. ఇప్పుడు లేనివాళ్లు అడిగితే మాత్రమే ఇస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.