India: కలిసుంటే కలదు సుఖం... ట్రంప్ కు చెక్ చెప్పేందుకు భారత్ సాయం కోరుతున్న చైనా!
- అమెరికాతో వాణిజ్య యుద్ధం తారస్థాయికి
- నష్ట నివారణకు భారత్ సాయం కోరుతున్న చైనా
- ఎన్ఎస్జీలోకి ప్రవేశానికి మద్దతు
- మసూద్ అజర్ ను ఉగ్రవాదిగా గుర్తిస్తాం
- తాయిలాలు ఆఫర్ చేస్తున్న చైనా
అమెరికాతో వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరిన వేళ, ఆందోళన చెందుతున్న చైనా, నష్ట నివారణకు భారత్ సాయాన్ని కోరుతోంది. ఇరుగు పొరుగున ఉన్న చైనా, భారత్ లు కలసివుంటే, అమెరికా కర్రపెత్తనాన్ని తట్టుకోవచ్చని, వాణిజ్య యుద్ధాన్ని రెండు దేశాలూ ఎదుర్కోవచ్చని సంకేతాలు పంపుతోంది. ట్రంప్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలతో, పన్నుల భారం పెరుగుతూ ఉండగా, వాణిజ్య లోటు పెరుగుతుండటం చైనాలో భయాన్ని కలిగిస్తోంది. దీని ప్రభావం ఓబీఓఆర్ వంటి భారీ ప్రాజెక్టులపై పడుతూ ఉండటంతో, సమస్యను పరిష్కరించుకునేందుకు చైనా, మలేసియా వంటి దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకోవాలని భావిస్తోంది.
పాక్, చైనాల మధ్య ఉన్న బంధం కారణంగా, చైనాతో కాస్తంత దూరంగా భారత్ ఉంటుండగా, మచ్చిక చేసుకునేందుకు చైనా కొన్ని తాయిలాలను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా భారత్ డిమాండ్ చేస్తున్న న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లోకి ఇండియా చేరేందుకు మద్దతు పలకడం, జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్ ను ఉగ్రవాదిగా గుర్తించి, అతన్ని నిషేధించడం వంటి ప్రకటనలు చేయాలని చైనా అధినేతలు యోచిస్తున్నట్టు సమాచారం.
ఇటీవల యువాన్ లో భారత్, చైనాల మధ్య జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశాల్లో ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చినట్టు అధికార వర్గాల భోగట్టా. రెండు దేశాల మధ్యా మరింత బలమైన ద్వైపాక్షిక బంధాలు, సహకారాన్ని విస్తరించడం వంటి అంశాలపై ఇక్కడ చర్చలు జరిగాయి. ఏ చర్యలు తీసుకున్నా పరస్పర ప్రయోజనం ప్రాతిపదికనే ఉండాలని ఇండియా కోరుకుంటోంది. అందుకు చైనా కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇండియా సహకరిస్తే, హిందూ మహా సముద్రంలో అమెరికా విస్తరిస్తుండటాన్ని అడ్డుకోవచ్చని, అమెరికా వాణిజ్య యుద్ధం కారణంగా ఏర్పడుతున్న నష్టాన్ని తగ్గించుకోవచ్చన్నది చైనా అభిమతం.