Chandrababu: బీఎస్ఈ గంట కొట్టిన చంద్రబాబు... అమరావతి బాండ్ల లిస్టింగ్!
- 9.15 గంటలకు గంట మోగించిన చంద్రబాబు
- బీఎస్ఈలో లిస్ట్ అయిన అమరావతి బాండ్లు
- పాల్గొన్న మంత్రులు యనమల, నారాయణ
అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులను సమీకరించే ఉద్దేశంతో బాండ్లను విక్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాటిని నేడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్టింగ్ చేసింది. ఈ ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంప్రదాయ గంటను మోగించి 9.15 గంటల సమయంలో బాండ్ల లిస్టింగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, సీఆర్డీయే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల బాండ్లను జారీ చేసిన తరువాత, కేవలం గంట వ్యవధిలోనే మదుపరుల నుంచి రూ. 2 వేల కోట్లు సమకూరిన సంగతి తెలిసిందే. కాగా, నిన్న రాత్రి ముంబై బయలుదేరి వచ్చిన చంద్రబాబు, నేడు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా, ప్రస్తుత చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, గోద్రేజ్ ఎండీ నదీర్ గోద్రేజ్, ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తదితరులతో ఆయన సమావేశం కానున్నారు.