Saamnaa: అసలు వాజ్ పేయి మృతి చెందింది ఎప్పుడు? 16కు ముందేనా?: శివసేన
- వాజ్ పేయి ఆరోగ్యం అంతకుముందే క్షీణించింది
- మోదీ ప్రసంగానికి ఇబ్బందులు లేకుండా చూసేందుకేనా?
- 'సామ్నా' సంపాదకీయంలో సంచలన వ్యాఖ్యలు
మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి మరణించిన తేదీపై శివసేన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన ఆగస్టు 16నే మృతి చెందారా? అని తన అధికార పత్రిక 'సామ్నా' ఎడిటోరియల్ లో ప్రశ్నించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న చేసే ప్రసంగానికి ఇబ్బంది కలుగకుండా చూసేందుకు ఆయన మరణించారన్న విషయాన్ని 16న వెల్లడించారా? అని కూడా పత్రిక ప్రశ్నించింది.
ఆయన ఆరోగ్యం అప్పటికి నాలుగైదు రోజుల ముందు నుంచే తీవ్రంగా విషమించిందని గుర్తు చేసిన 'సామ్నా', ఉత్సాహంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే, దేశంలో సంతాపదినాలు, జెండాల అవనతం లేకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని కూడా అడిగింది. 'స్వరాజ్యమంటే ఏంటి?' అన్న శీర్షికతో సంపాదకీయం రాసిన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్, మోదీ సుదీర్ఘమైన ప్రసంగానికి అడ్డంకులు లేకుండా చూసేందుకు వాజ్ పేయి మృతిని 16న ప్రకటించారన్న అనుమానాలు వ్యక్తం చేశారు.