Marriage: విడాకుల పిటిషన్ పరిష్కారం కాకపోయినప్పటికీ... రెండో పెళ్లి చెల్లుతుంది: సుప్రీంకోర్టు కీలక రూలింగ్
- పిటిషన్ పెండింగ్ లో ఉండగానే పెళ్లి చేసుకున్న వ్యక్తి
- ఆ వివాహం చెల్లదని తీర్పిచ్చిన హైకోర్టు
- విచారించి తీర్పును సవరించిన అత్యున్నత న్యాయస్థానం
ఏదైనా కోర్టులో విడాకుల పిటిషన్ పెండింగ్ లో ఉన్న సమయంలో జరిగిన రెండో వివాహం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ను ఇచ్చింది. హిందూ వివాహ చట్టంలోని వివాహ అనర్హత నిబంధన ద్వారా రెండో వివాహాన్ని రద్దు చేయలేమని న్యాయమూర్తులు ఎస్‌ఏ బాబ్డే, ఎల్ నాగేశ్వరరావుల ధర్మాసనం పేర్కొంది. అయితే, విడాకుల పిటిషన్ పరిష్కృతమయ్యే వరకు రెండో వివాహంపై ఆంక్షలు విధించిన ధర్మాసనం, భార్యాభర్తలు కోర్టు బయట సమస్యను పరిష్కరించుకుంటే, సెక్షన్ 15 వర్తించదని వెల్లడించింది.
తన భార్యతో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి, అది పెండింగ్ లో ఉండగానే మరో వివాహం చేసుకున్నాడు. ఆపై కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేస్తూ, తన తొలి భార్యతో సమస్యను పరిష్కరించుకున్నానని, తన పిటిషన్ ను వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలని కోరాడు. విడాకుల పిటిషన్ పెండింగ్ లో ఉండగా జరిగిన వివాహం చెల్లబోదని హైకోర్టు తీర్పునివ్వడంతో, బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు తీర్పిచ్చింది.