BJP: సంస్మరణలో ముచ్చట్లాడుకున్న ఆ ఇద్దరు మంత్రులపై వేటేయండి.. వాజ్‌పేయి మేనకోడలు డిమాండ్

  • వాజ్‌పేయి సంస్మరణ సభలో మంత్రుల నవ్వులు
  • ఆవేదనకు గురిచేసిందన్న కరుణ శుక్లా
  • మాజీ ప్రధానిపై బీజేపీకి ప్రేమ లేదన్న కాంగ్రెస్

దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంస్మరణ సభలో నవ్వుతూ ముచ్చట్లాడుకున్న ఇద్దరు మంత్రులపై వేటేయాలని వాజ్‌పేయి మేనకోడలు కరుణ శుక్లా డిమాండ్ చేశారు. తన మేనమామ సంస్మరణ సభలో ఆ మంత్రులు వ్యవహరించిన తీరు తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. వాజ్‌పేయిపై వారికి ఎటువంటి గౌరవం లేదని, ఏదో రావాలి కాబట్టి సభకు వచ్చారని పేర్కొన్నారు. వారిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే తర్వాతి తరం నాయకులకైనా తెలిసి వస్తుందన్నారు.

వాజ్‌పేయి అస్థికలను నదుల్లో కలిపే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సంస్మరణ సభకు ఛత్తీస్‌గఢ్‌ వ్యవసాయశాఖ మంత్రి బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌, ఆరోగ్యశాఖ మంత్రి అజయ్‌ చంద్రకర్‌ హాజరయ్యారు. సభ జరుగుతుంటే వీరిద్దరూ నవ్వుకుంటూ, జోకులేసుకుంటూ కనిపించడం వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో మంత్రులపై నెటిజన్లు దుమ్మెత్తి పోశారు.

మంత్రులు వ్యవహరించిన తీరుపై చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శైలేశ్ నితిన్ త్రివేదీ మాట్లాడుతూ.. వాజ్‌పేయిని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ, ఇటువంటి చేష్టలతో అగౌరవపర్చడం సరికాదని హితవు పలికారు. ఆయన జీవించి ఉన్నప్పుడు కూడా మంత్రులు ఆయనను విస్మరించారని విమర్శించారు. ఆయనపై ప్రేమ ఉన్నట్టు ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ సహా బీజేపీ నటిస్తోందని మండిపడ్డారు.

BJP
Vajpayee
NDA
Chattisgarh
Ministers
Karuna shukla
  • Loading...

More Telugu News