modi: మోదీకి అమిత్ షా కన్నా కేసీఆర్ అత్యంత సన్నిహితుడు!: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
- కేసీఆర్ పాలనలో ఏ కార్యక్రమమూ ప్రగతి సాధించలేదు
- నిరుద్యోగులకు నిరాశే మిగిలింది
- హామీలు నెరవేర్చకుండా ఓట్లు ఎలా అడుగుతారు?
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయనపై టీ-సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కన్నా కేసీఆరే అత్యంత సన్నిహితుడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో ఆయన చేపట్టిన ఏ కార్యక్రమమూ ప్రగతి సాధించలేదని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఉద్యోగాలు వస్తాయనుకున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని, రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఆ ఖాళీలను భర్తీ చేయలేకపోయారని మండిపడ్డారు. కొత్త జిల్లాలను ఆమోదింప చేసుకోవడానికి జోనల్ విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించిన జీవన్ రెడ్డి, ఇచ్చిన హామీలను నెరవేర్చనప్పుడు ప్రజలను ఓట్లు అడిగే అర్హత ఉండదని అన్నారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో సీఎం కేసీఆర్ చెప్పాలని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.