ys jagan: యువతిపై లైంగిక వేధింపులు.. వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేసిన విద్యార్థిని!
- విశాఖ ఓకేషనల్ కాలేజీ డైరెక్టర్ వేధింపులు
- పోలీసులు పట్టించుకోవడం లేదన్న యువతి
- ప్రతిపక్ష నేతకు మొరపెట్టుకున్న బాధితురాలు
విశాఖపట్నంలోని విశాఖ ఒకేషనల్ జూనియర్ కళాశాల డైరెక్టర్ కుమార్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఓ యువతి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేసింది. పోలీసులను ఆశ్రయించినా అధికార పార్టీ నేతల మద్దతుతో కేసు నమోదు చేయడం లేదని వాపోయింది. కుమార్ వ్యవహారశైలిపై విద్యార్థులంతా కలసి ఆందోళన నిర్వహించినా ఫలితం లేకుండాపోయిందని యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విశాఖలో పర్యటిస్తున్న జగన్ ను బాధిత యువతి నిన్న కలుసుకుని వినతిపత్రం అందించింది. వారం రోజుల క్రితం కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందనీ, కుమార్ కు మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ మద్దతుగా నిలుస్తున్నారని చెప్పింది. తన ఫిర్యాదుతో కుమార్ ను స్టేషన్ కు పిలిపించిన పోలీసులు ఇప్పటివరకూ కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని బాధితురాలు తెలిపింది.
తమ కళాశాలకు ప్రభుత్వ గుర్తింపు లేకపోవడంతో అక్టోబర్ లో జరిగే జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ పరీక్ష రాయాల్సిన 250 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని బాధితురాలు వాపోయింది. నిందితులను కఠినంగా శిక్షించేలా చూడాలని కోరింది.