Andhra Pradesh: కాంగ్రెస్‌తో పొత్తుపై తేల్చేసిన చంద్రబాబు.. పవన్‌పై సెటైర్లు!

  • కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోం
  • కొత్త పార్టీలు పెట్టి టీడీపీని బలహీన పర్చలేరు
  • మోదీకి బుద్ధి చెప్పాల్సిందే

కర్నూలు జిల్లా ఎస్టీబీసీ మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన ధర్మపోరాట సభలో ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. కుట్రలతో తనను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తులు, అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వారు తనను విమర్శిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై కుట్రలు చేసేందుకే కొత్త పార్టీలు పెట్టిస్తున్నారని, కుట్రలతో తెలుగుదేశం పార్టీని బలహీన పర్చలేరని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్‌తో టీడీపీ జట్టుకట్టబోతోందంటూ వస్తున్న వార్తలపైనా చంద్రబాబు స్పందించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశమని, కాంగ్రెస్‌తో ఎట్టిపరిస్థితుల్లోనూ కలవబోమని స్పష్టం చేశారు. నిన్నమొన్నటి వరకు పవన్ కల్యాణ్‌కు తాను బాగానే కనిపించానని, కానీ ఇప్పుడు ఆయన కూడా తనను విమర్శిస్తున్నారని సెటైర్లు వేశారు. నిపుణుల కమిటీ పెట్టి మరీ ఏపీకి కేంద్రం రూ.75 వేల కోట్లు ఇవ్వాలని తేల్చారని, కానీ దాని గురించి మాత్రం మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీ బోసిపోయేలా అమరావతిని నిర్మిస్తామని తిరుపతి సభలో హామీ ఇచ్చిన మోదీ.. మోసం చేశారని, అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలా? వద్దా? అని ప్రశ్నించి సభకు హాజరైన వారితో నినాదాలు చేయించారు. బీజేపీతో లాలూచీ పడిన జగన్, పవన్‌లకు బుద్ధి చెప్పాలని ప్రజలకు చంద్రబాబు పిలుపు నిచ్చారు.

  • Loading...

More Telugu News