Chandrababu: కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్లు ఇస్తామన్నాం.. ఇచ్చి చూపించాం!: చంద్రబాబు
- కడపలో పర్యటించిన ఏపీ సీఎం
- వనం-మనం కార్యక్రమంలో పాల్గొన్న బాబు
- గండికోటకు మరో రూ.400 కోట్లు ఇస్తానని వెల్లడి
చిత్తూరు జిల్లాలోని తన నియోజకవర్గం కుప్పం కంటే ముందే కడపలోని పులివెందులకు నీళ్లు ఇస్తామని మాటిచ్చామనీ, దాన్ని నిలబెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. గతంలో సింహాద్రిపురం రైతులు తనవద్దకు నీళ్లు ఇవ్వాలని వచ్చారనీ, దీంతో 2 టీఎంసీల నీరు ఇచ్చి అక్కడ చీనీ పంట ఎండిపోకుండా కాపాడానని తెలిపారు. కడప జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఈ రోజు జరిగిన ‘వనం-మనం’ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. విద్యార్థులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
కడపను హార్డికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు. కడప ఫాతిమా మెడికల్ కాలేజీ వ్యవహారంపై కూడా సీఎం మాట్లాడారు. కాలేజీ యాజమాన్యం పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలనీ, భవిష్యత్ లో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదనీ, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఏడాది కడప జిల్లాలో వర్షపాతం సాధారణం కంటే 58 శాతం తక్కువగా నమోదైందని చంద్రబాబు అన్నారు. కానీ తాను దూరదృష్టితో మిషన్ హరితాంధ్రప్రదేశ్, నీరు-ప్రగతి, నీరు-చెట్టు వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నష్టం కలగకుండా అరికట్టానని వెల్లడించారు. కృష్ణా, గోదావరి నదులను పట్టిసీమ ద్వారా అనుసంధానం చేశామనీ, గతేడాది ఈ నీటిని శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తీసుకొచ్చామని బాబు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 57 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామనీ, వీటిలో 15-20 ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తిచేశామని పేర్కొన్నారు. మిగతా ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని చంద్రబాబు తెలిపారు.
కడపలో గండికోట ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చుపెట్టామనీ, జలాశయంలో 20 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు మరో రూ.400 కోట్లు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.