Paytm: ‘పేటీఎం మనీ’ మ్యూచువల్ ఫండ్.. ఫీజు లేకుండానే అత్యుత్తమ సేవలు!
- రెండు వారాల్లో ప్రారంభంకానున్న ప్రక్రియ
- ఇప్పటికే 7.7లక్షల మంది పేర్లు నమోదు
- వినియోగదారుల స్పందన బాగుందంటున్న సంస్థ
ఈ వేళ చాలామంది యువత సంపద సృష్టి కోసం మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంచుకుంటున్నారు. దీంతో పలు సంస్థలు రకరకాల స్కీముల్లో మ్యూచువల్ ఫండ్స్ ను ప్రవేశపెడుతూ, సేవల రూపంలో కస్టమర్లపై వీర బాదుడు బాదుతున్నాయి. ఈ క్రమంలో డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తమ ఖాతాదారులకు మ్యూచువల్ ఫండ్ సేవలను ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.
తమ సబ్సిడరీ ‘పేటీఎం మనీ’ ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన డైరెక్ట్ ప్లాన్స్‌కు చెందిన మ్యూచువల్ ఫండ్ పథకాలను మరో రెండు వారాల్లో అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ‘పెట్టుబడులు పెట్టే విధానాన్ని సరళీకృతం చేసి పారదర్శకంగా సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మా క్ష్యం’ అని పేటీఎం మనీ పూర్తికాల సంచాలకుడు ప్రవీణ్ జాదవ్ తెలిపారు.
'మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ప్రస్తుతం 2 కోట్ల మంది మదుపరులున్నారు. రానున్న ఐదేళ్లలో మరో మూడు కోట్ల మంది కొత్త పెట్టుబడిదారులు వస్తారు. ఈ స్థితిలో మంచి సేవలు అందుబాటులోకి తెస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నది మా అంచనా’ అని ఆయన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. పెట్టుబడులు, సంపద సృష్టి కోసం ఓ వేదిక రూపొందిస్తున్నామని, తమ ప్రయత్నం పట్ల ఇప్పటికే 7.7 లక్షల మంది ఖాతాదారులు ఆసక్తి చూపి పేర్లు నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు.