Billion market: ఒక్కసారిగా పడిపోయిన వెండి ధర.. కిలోకు ఏకంగా మూడు వేలు తగ్గింది!
- వారం రోజులుగా కొనసాగుతున్న రూపాయి పతనం
- అయినా తగ్గుతున్న వెండి ధర
- నిలకడగా ఉన్న పసడి ధర
వెండి ధర ఒక్కసారిగా పతనమైంది. నిన్నమొన్నటి వరకు రూ.41 వేలకుపైగా ఉన్న ధర ఒక్కసారిగా మూడు వేలు తగ్గి రూ.37,800కు చేరుకుంది. నిజానికి రూపాయి పతనం ఆధారంగా బులియన్ మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. పసిడి, వెండి ధరల్లో ఒకేసారి మార్పు కనిపిస్తుంటుంది. అయితే, రూపాయి ధర పతనమైతే ఆ మేరకు వెండి, బంగారం ధరలు కూడా పెరుగుతాయి. అయితే, ఈసారి అందుకు విరుద్ధంగా జరగడం బులియన్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
గత వారం రోజులుగా రూపాయి ధర పతనం అవుతున్నా వెండి ధర పెరగకపోగా, మరింత పతనం అవుతూ వస్తోంది. వారంలోనే రెండు వేల రూపాయలు తగ్గింది. అయితే, అదే సమయంలో బంగారం ధరలో మాత్రం మార్పు లేకపోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బంగారం బిస్కెట్ ధర రూ.3.7 లక్షల వద్ద స్థిరంగా ఉంది. వెండి ధర భారీగా తగ్గినప్పటికీ వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్ లేదని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.