Telangana: తెలంగాణలో ఇకపై అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుంచే వేతనాల చెల్లింపు.. కేసీఆర్ ఆదేశాలు!
- సెప్టెంబర్ 1 నుంచి అమలు
- అర్చకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు
- సోమవారం ఉత్తర్వులు జారీ చేయాలి : సీఎం కేసీఆర్
తెలంగాణలోని దేవాదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో పని చేసే అర్చకులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్న మాదిరిగానే ఇకపై తెలంగాణ సర్కారే అర్చకులకు వేతనాలు చెల్లిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి అర్చకులకు ప్రభుత్వ ఖజానా ద్వారా వేతనాలు అందుతాయని, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సవరించినప్పుడు, అర్చకుల వేతనాలను కూడా విధిగా సవరిస్తామని అన్నారు. అర్చకుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు రూపొందించి, సోమవారం నాటికి ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులను కేసీఆర్ ఆదేశించారు.