KTR: వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే.. టీఆర్ఎస్ సెంచరీ కొట్టబోతోంది: మంత్రి కేటీఆర్

  • ఈ నాలుగేళ్లలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలిచాం
  • ‘తెలంగాణ’ ఏర్పడేటప్పుడు ఎన్ని మాటలు మాట్లాడారు!
  • కాంగ్రెస్ వాళ్ల కళ్లు తిరిగేలా పాలన సాగిస్తున్నాం

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క మత కల్లోలం సంఘటన కూడా లేకుండా, ఒక్కరోజూ కూడా కర్ఫ్యూ విధించకుండా తాము పరిపాలిస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ పరిణతితో అభివృద్ధి వైపు దృష్టి సారించారని సాక్షాత్తూ ప్రధాని మోదీయే చెప్పారని అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా పరిపాలన సాగుతోందని, సంక్షేమాన్ని, అభివృద్ధిని మేళవించి ముందుకు పోతున్నామని, నాలుగేళ్లలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకే వచ్చే నెల 2న ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ప్రతిపక్షాలు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నాయని, వాళ్లు ఉపయోగిస్తున్న భాష చూస్తుంటే బాధేస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబపాలన గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. కుటుంబపాలన గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉందని విమర్శించారు. రాహుల్ పేరు వెనుక గాంధీ అనే పేరు లేకపోతే లీడర్ అయ్యేవాడా? అని ప్రశ్నించారు.

‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఎన్ని మాటలు మాట్లాడారు! మీకు పరిపాలన వస్తుందా? మీకు తెలివుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ల కళ్లు తిరిగి అడ్డం పడేలా పాలన సాగిస్తున్నాం. ఈ నాలుగేళ్లలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపు టీఆర్ఎస్ దే. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే, టీఆర్ఎస్ సెంచరీ కొట్టబోతోంది’ అని కేటీఆర్ అన్నారు.

KTR
  • Loading...

More Telugu News