jagan: జగన్-పవన్ లు మోదీకి జోడెద్దులు: జూపూడి విమర్శ

  • పెళ్లిళ్ల భాష మాట్లాడటం ప్రతిపక్షం వారికి అలవాటైంది
  • బీజేపీతో వైసీపీకి స్నేహమేంటి?
  • మొదట్లో సీఎం కావాలనే ఆలోచన పవన్ కు లేదు

రాజకీయంగా పొత్తులు పెట్టుకున్నా, స్నేహంగా ఉన్నా పెళ్లిళ్లుగా పేర్కొనడం, పెళ్లిళ్ల భాష మాట్లాడటం ప్రతిపక్షం వారికి అలవాటైందని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ఏపీ సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేసిన బీజేపీతో వైసీపీకి స్నేహం ఏంటని ప్రశ్నించారు. మొన్నటి వరకు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన పవన్ కల్యాణ్ కు లేదని, ఇప్పుడు ‘చంద్రబాబు నాయుడు కావాలా? అవినీతికి పాల్పడిన జగన్ కావాలా? నేను కావాలా?’ అని ప్రజలను పవన్ అడుగుతున్నారని విమర్శించారు. జగన్-పవన్ ఇద్దరూ మోదీకి జోడెద్దులులాంటివారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో చలనం కలిగించారని, వచ్చే ఎన్నికలలో జాతీయ స్థాయిలో చంద్రబాబు ప్రధాన భూమిక పోషిస్తారని జూపూడి అన్నారు. మమతా బెనర్జీ, మాయావతి, దేవెగౌడ, మూలాయం సింగ్, నితీష్, కమ్యూనిస్టులు అందరితో మాట్లాడతారని, అవసరమైతే మాయావతిని ఇక్కడకు రప్పిస్తామని తెలిపారు. చంద్రబాబు పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, పవన్ చెంపలేసుకొని చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని, రాజ్యసభలో జరిగిన చర్చలో కూడా ఒక్క బీజేపీ తప్ప అందరూ ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పినవారేనన్న విషయాన్ని జూపూడి ఈ సందర్భంగా ప్రస్తావించారు.  

  • Loading...

More Telugu News