gvl: కేంద్రంపై కూడా సీబీఐ విచారణ కోరతారా?: జీవీఎల్ కు జూపూడి సవాల్

  • పీడీ ఖాతాలపై జీవీఎల్ వి తెలిసీ తెలియని మాటలు  
  • ఏపీలో జరిగే అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ఈ వ్యాఖ్యలు
  • ఈ ఖాతాలలో అవినీతి జరిగే అవకాశమే లేదు

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంతో పాటు, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో కూడా అవినీతి జరిగినట్లు కాగ్ నివేదిక పేర్కొందని, అందువల్ల కేంద్రంపై కూడా సీబీఐ విచారణ జరపాలని జీవీఎల్ కోరాలని జూపూడి డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని జీర్ణించుకోలేక జీవీఎల్ తెలిసీ తెలియని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాలలోని వివిధ శాఖల మధ్య కేంద్రం పెట్టిన పోటీలో ఏపీలోని పంచాయతీరాజ్, ఐటీ, పరిశ్రమలు వంటి శాఖలు దేశంలో మొదటి స్థానంలో నిలిచాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సరళతర వ్యాపార విధానం)లో కూడా ప్రథమ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఇవన్నీ కేంద్రం ఇచ్చినవేనని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని పీడీ ఖాతాలపై తెలిసీ తెలియని విధంగా మాట్లాడుతున్నారని, పీడీ ఖాతాలు దేశంలోని 29 రాష్ట్రాల్లో ఉంటాయని జూపూడి చెప్పారు. ఇవి ఆర్థిక పరమైన వెసులుబాటు కోసం ఏర్పాటు చేసుకున్న ఖాతాలు మాత్రమేనని తెలిపారు. ఈ ఖాతాలలో అవినీతి జరిగే అవకాశమే లేదని, ఈ ఖాతాలపై సీబీఐ విచారణ జరిపించమని కోరడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సీబీఐ విచారణ జరిపినా గుండుసున్నా మిగులుతుందని, కాగ్ నివేదికలో అవినీతి జరిగినట్లు పేర్కొన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సీబీఐ విచారణ జరిపించమని జీవీఎల్ కోరాలని డిమాండ్ చేశారు.

రూ.9,500 కోట్లకు బ్యాంకులను ముంచి లండన్ పారిపోయన విజయ మాల్యా గురించి గానీ, అనేక బ్యాంకులను ముంచిన నీరవ్ మోదీ గురించి గానీ జీవీఎల్ ఎందుకు మాట్లాడలేదు? రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై సీబీఐ విచారణ వేశారా? అని జూపూడి ప్రశ్నించారు. వారానికోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేయడం వారికి అలవాటైపోయిందని, కొందరు రాజకీయ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారని, రాజకీయ పార్టీలు జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఎన్నికలలో పొత్తులు పెట్టుకుంటాయని అన్నారు.

  • Loading...

More Telugu News