USA: అమెరికాను వంచించి ఉగ్రవాదానికి పాక్ మద్దతిచ్చింది: అమెరికా రిటైర్డ్ ఆర్మీ కల్నల్ లారెన్స్ సెల్లిన్
- అమెరికాకు 17ఏళ్ళుగా పాకిస్తాన్ వెన్నుపోటు పొడుస్తోంది
- ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ మద్దతునిస్తుంది
- అమెరికా సైనికుల మరణానికి పాకిస్తాన్ కారణం
పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతునిచ్చే దేశమని, గత 17 సంవత్సరాలుగా అది అమెరికాకు వెన్నుపోటు పొడుస్తున్న దేశమని అమెరికా రిటైర్డ్ ఆర్మీ కల్నల్ లారెన్స్ సెల్లిన్ ఆరోపించారు. ‘ది డైలీ కాలర్’ వెబ్ పత్రికలో ఆయన రాసిన వ్యాసంలో పాకిస్తాన్ చేసిన ఆకృత్యాలను వివరించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ, ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా దాడులు చేసిన సమయంలో కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతునిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఆ విధంగా అమెరికా సైనికుల మరణాలకు పాకిస్తాన్ కారణమైందని చెప్పారు. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్ తదితర ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ సహకరిస్తోందని చెప్పిన ఆయన, తాలిబన్ ఉగ్రవాదులకు ఆయుధాలను పాక్ సమకూర్చిందని చెప్పారు. 2001 అక్టోబర్ లో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఉగ్రవాదులకు ఆయుధాలు సమకూర్చిందని తెలిపారు.
కల్నల్ సెల్లిన్ ఆప్ఘనిస్థాన్, ఉత్తర ఇరాక్, పశ్చిమ ఆఫ్రికాలలో జరిగిన యుద్ధ సమయంలో సేవలందించారు. ఆ సమయంలో పాకిస్తాన్ చేసిన దారుణాలను ఆయన ప్రస్తావించారు. ఇస్లామిక్ ఉగ్రవాదులతో అమెరికా పోరాడుతున్న సమయంలో.. అమెరికాకు సహాయం చేయవద్దని అప్పటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ఐఎస్ఐ డైరెక్టర్ కి చెప్పారని ఆయన పేర్కొన్నారు.