Pakistan: కేరళకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన పాకిస్థాన్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-a0e460916d33b54d54fa232d13c6b838837550e1.jpg)
- కేరళ ప్రజలు త్వరగా కోలుకోవాలి
- మా ప్రార్థనలన్నీ వారి కోసమే
- అవసరమనుకుంటే సాయానికి రెడీ
వరదలతో సర్వం కోల్పోయిన కేరళను ఆదుకునేందుకు దాయాది దేశం పాకిస్థాన్ ముందుకొచ్చింది. కేరళ వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. కేరళకు తమవంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కేరళ ప్రజలు త్వరగా కోలుకోవాలని పాకిస్థాన్ ప్రజల తరపున ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. వరద బాధితులు త్వరగా కోలుకోవాలని పాక్ ప్రజలు ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అవసరమనుకుంటే తమవంతు మానవతా సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఇమ్రాన్ పేర్కొన్నారు.
కేరళలో వరద తగ్గుముఖం పట్టడంతో సహాయక శిబిరాల్లో ఉన్నవారు నెమ్మదిగా ఇళ్లకు తరలివస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాధితులకు ఆహారం, నీళ్లు తదితర వాటిని పంపిణీ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలు పంపించిన మందులు, ఆహారం, దుస్తులు ఇప్పటికే కేరళ చేరుకున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో ముమ్మరంగా పనిచేస్తున్నాయి.