Tamil Nadu: రాష్ట్రంలో వరదలకు తమిళనాడే కారణం.. కేరళ సంచలన ఆరోపణ!
- 150 ఏళ్ల క్రితం నిర్మించిన ముళ్ల పెరియార్ ప్రాజెక్టు నిర్మాణం
- కూల్చివేసి కొత్తది నిర్మించాలని కేరళ డిమాండ్
- ససేమిరా అంటున్న తమిళనాడు
కేరళలో వరదలకు ప్రకృతి ప్రకోపం కారణం కాదా? అవుననే అంటోంది ఆ రాష్ట్రం. తమ రాష్ట్రంలో వరదలకు పొరుగునున్న తమిళనాడే కారణమని ఆరోపిస్తూ గురువారం కోర్టుకెక్కింది. తమ రాష్ట్రంలో ఉన్న ముళ్ల పెరియార్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా ఇడుక్కి డ్యామ్‌లో చేరిందని కేరళ పేర్కొంది. ఈ నెల 15న ఇడుక్కి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో కేరళను వరద ముంచెత్తిందని ఆరోపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
తమిళనాడు ప్రజలకు నీటిని అందించాలన్న ఉదాత్త లక్ష్యంతో శతాబ్దంన్నర క్రితం ముళ్ల పెరియార్ ప్రాజెక్టును కేరళలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను తమిళనాడే చూసుకుంటోంది. పెరియార్ ప్రాజెక్టును నిర్మించి 150 ఏళ్లకు పైగా కావడంతో దానిని కూల్చివేసి కొత్తది నిర్మించాలని కేరళ డిమాండ్ చేస్తూ వస్తోంది. అంతేకాక, డ్యామ్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 142 నుంచి 139 అడుగులకు తగ్గించాలని కోరుతోంది. కేరళ విజ్ఞప్తిని తమిళనాడు పట్టించుకోవడం లేదు. ఇప్పుడీ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం వల్లే వరదలు ముంచెత్తాయని కేరళ ఆరోపిస్తోంది.