Chandrababu: ఏపీలో ప్రతి విద్యార్థి భవిష్యత్తును బంగారు బాటగా మార్చే బాధ్యత నాది: సీఎం చంద్రబాబు

  • ఆంధ్రా యూనివర్శిటీలో ‘జ్ఞానభేరీ’ కార్యక్రమం
  • ఏపీలో విద్యార్థులకు అన్ని విధాలా చేయూతనిస్తా
  • దాన్ని అందిపుచ్చుకుని విద్యార్థులు ముందుకెళ్లాలి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తును బంగారు బాటగా మార్చే బాధ్యత తాను తీసుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్శిటీలోని ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ‘జ్ఞానభేరీ’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీలో విద్యార్థులకు అన్ని విధాలా చేయూతనిస్తానని, దాన్ని అందిపుచ్చుకుని ముందుకెళ్లే బాధ్యత మాత్రం తమదేనని విద్యార్థులందరూ ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. సిలికాన్ వ్యాలీ అంటే అమెరికా ఎలా గుర్తొస్తుందో, రాబోయే రోజుల్లో ఇన్నోవేషన్ వ్యాలీ అంటే ప్రపంచం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గుర్తుకు రావాలని, శ్రీకాకుళం నుండి కర్నూలు వరకు ఒక ఇన్నోవేషన్‌గా తయారు కావాలని, అందుకు ‘జ్ఞానభేరి’ నాంది పలకాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.జీవితంలో అన్నింటి కంటే విద్యార్థి దశ కీలకమని, ఈ దశలోనే లక్ష్యాలు నిర్దేశించుకుని, ఫలితాలు వచ్చే వరకూ కష్టపడాలని సూచించారు. లక్ష్యాలను చేరుకోవడానికి వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే కావాలని సంకల్పించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు.

 యువత ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వినూత్నంగా ఆలోచించి కొత్త ఆవిష్కరణలు చేయాలని యువతకు చంద్రబాబు పిలుపు నిచ్చారు. విశాఖ వేదికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులలోని ఒప్పందాలన్నీ అమలైతే వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో 34 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. పలు కంపెనీలతో రూ.16 లక్షల కోట్ల మేర ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు. టీడీపీ చేసిన కృషి ఫలితంగా నాలుగేళ్లలో మంచి ఫలితాలు వచ్చాయని, కేంద్రం సహకరించకపోయినా, రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీపడకుండా ముందుకెళ్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News