kuldipnayyar: పాత్రికేయ విలువలకు దర్పణం కుల్దీప్ నయ్యర్: పవన్ కల్యాణ్

  • కుల్దీప్ నయ్యర్ మృతిపై పవన్ దిగ్భ్రాంతి
  • ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం
  • కుల్దీప్ నయ్యర్ కుటుంబసభ్యులకు నా సానుభూతి

ప్రముఖ పాత్రికేయుడు, బ్రిటన్ మాజీ హై కమిషనర్ కుల్దీప్ నయ్యర్ మృతిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కుల్దీప్ నయ్యర్ తుదిశ్వాస విడిచారని తెలియగానే ఎంతో బాధ కలిగిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. పాత్రికేయ రంగంలో విలువలకు దర్పణంలా నిలిచిన కుల్దీప్ నయ్యర్.. వర్తమాన రాజకీయాలు, సామాజిక, పౌర అంశాలపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేసేవారని అన్నారు.

‘బియాండ్ ది లైన్స్’ ఇండియా ఆఫ్టర్ నెహ్రూ’ లాంటి కులదీప్ రచనలు విశ్లేషణాత్మకంగా, నాటి పరిస్థితులని తెలియజేసేలా ఉన్న విషయాన్ని పవన్ ప్రస్తావించారు. కుల్దీప్ నయ్యర్ తన ఆలోచనలకు నిర్భీతిగా అక్షర రూపం ఇచ్చారని, పౌరసేవలు మరింత మెరుగుపడటంతో పాటు పారదర్శకంగా ఉండాలని తపించేవారని, నాడు ‘ఎమర్జెన్సీ’కి వ్యతిరేకంగా ఆయన గళం విప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. నయ్యర్ బ్రిటన్ హై కమిషనర్ గా, పార్లమెంట్ సభ్యుడిగానే కాకుండా మానవహక్కుల ఉద్యమకారుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కుల్డీప్ నయ్యర్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News