Uttar Pradesh: నెల జీతం అడిగితే రూ.6 చేతిలో పెట్టారు!: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్యాయత్నం

  • యూపీలో ఓ షూ కంపెనీ నిర్వాకం
  • మొత్తం జీతాన్ని కట్ చేసిన యజమాని
  • పోలీసుల మధ్యవర్తిత్వంతో తీరిన సమస్య

ఫ్యాక్టరీలో చేరిన ఓ యువకుడు నెల రోజుల తర్వాత జీతం అడగ్గా యాజమాన్యం చేతిలో రూ.6 పెట్టింది. ఇదేంటని ప్రశ్నిస్తే ఎవ్వరూ జవాబు చెప్పలేదు. దీంతో మనస్తాపం చెందిన సదరు యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటుచేసుకుంది.

అజయ్ కౌశల్(30) అనే వ్యక్తి ఆగ్రాలోని ఓ షూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జూలై 27న అజయ్ కు యాక్సిడెంట్ జరిగింది. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించిన యాజమాన్యం.. చికిత్స ఖర్చు మొత్తాన్ని భరించింది. కోలుకున్నాక ఫ్యాక్టరీకి వచ్చి జీతం అడగగా అతని చేతిలో రూ.6 పెట్టింది. తన జీతం నుంచి నెలనెలా కొంత మొత్తాన్ని కట్ చేసుకోవాలని అజయ్ కోరాడు. అయినా యాజమాన్యం అంగీకరించకపోవడంతో అతను ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న ఫ్యానుకు ఉరివేసుకున్నాడు.

దీన్ని గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే అజయ్ ను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షూ కంపెనీ యజమానితో మాట్లాడారు. దీంతో అతను మొత్తం జీతం కాకుండా నెలనెలా కొంతమొత్తం తీసుకునేందుకు అంగీకరించాడు. సమస్య పరిష్కారం కావడంతో పోలీసులు ఈ విషయంలో కేసు నమోదు చేయలేదు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News