Megha Rajagopalan: మా విషయాల్లోనే కల్పించుకుంటావా.. అమెరికా జర్నలిస్ట్ కు షాకిచ్చిన చైనా!
- భారత సంతతి జర్నలిస్ట్ మేఘాకు ఝులక్
- ముస్లింలపై ప్రభుత్వ దమనకాండను రిపోర్ట్ చేసిన మేఘా
- స్వదేశానికి తిరిగివెళ్లనున్న జర్నలిస్ట్
పొరుగు దేశాలకు సంబంధించిన ప్రతీ విషయంలోనూ వేలుపెట్టే చైనా.. తన అంతర్గత వ్యవహారాల్లో మాత్రం ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదని చెబుతుంది. తాజాగా గ్జింజియాంగ్ ప్రావిన్సులో ముస్లిం మతస్తులపై జరుగుతున్న అణచివేతను రిపోర్ట్ చేయడంతో ఓ భారత సంతతి అమెరికన్ జర్నలిస్ట్ వీసాను చైనా పునరుద్ధరించకుండా నిలిపివేసింది.
అమెరికాకు చెందిన భారత సంతతి జర్నలిస్ట్ మేఘా రాజగోపాలన్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలిపారు. చైనాలో ఉయ్ ఘర్ ముస్లింలను అణచివేసి, మసీదులను ప్రభుత్వం కూల్చివేస్తున్న విషయాన్ని మేఘా రిపోర్ట్ చేశారు. అధికారులు తమపై నిఘా పెట్టడంతో పాటు వేధిస్తున్నారని అక్కడి ముస్లింలు చెప్పిన మాటలను రికార్డు చేశారు. దీంతో ఆమె వీసాను రెన్యూవల్ చేయడానికి డ్రాగన్ దేశం నిరాకరించింది.
తాను ఆరేళ్లుగా చైనాలో రిపోర్టింగ్ చేస్తున్నానని మేఘా రాజగోపాలన్ ట్విట్టర్ లో తెలిపారు. తన జర్నలిస్ట్ వీసా దరఖాస్తు పరిశీలనలో ఉన్నట్లు మే నెలలో చైనా విదేశాంగ శాఖ అధికారులు చెప్పారనీ, కానీ ఇప్పటివరకూ వీసాను జారీచేయలేదని వెల్లడించారు. దీంతో అమెరికాకు తిరిగి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మేఘా అమెరికాకు చెందిన బజ్ ఫీడ్ అనే సంస్థలో జర్నలిస్ట్ గా పనిచేస్తోంది. కాగా వీసా జారీలో నిర్లక్ష్యంపై విదేశాంగ శాఖను ప్రశ్నిస్తామని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ చైనా తెలిపింది.