Arun Jaitley: తిరిగి బాధ్యతలు స్వీకరించిన జైట్లీ.. ఇంటర్నెట్ లో పేలుతున్న జోకులు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-e8e1d32e9d9c2e7f63af79f5a1e352e0ade8a8e6.jpg)
- 3 నెలల తర్వాత బాధ్యతలు
- కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ
- ఇంటర్నెట్ లో నెటిజన్ల ట్రోలింగ్
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (65) ఈ రోజు ఆర్థిక మంత్రిగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు. ఆమధ్య అనారోగ్యం కారణంగా ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్ అనంతరం కొన్నాళ్లు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జైట్లీ ఇటీవల ఇంటికి చేరుకున్నారు.
ఇన్షెక్షన్లు సోకే అవకాశం ఉండటంతో బయటకు కూడా రాలేదు. ఇటీవల కొన్నిరోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలు, మీడియా సమావేశాల్లో పాల్గొంటున్న జైట్లీ, తాజాగా 3 నెలల తర్వాత ఈ రోజు ఆర్థిక మంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ ఆర్థిక శాఖను చూసిన మంత్రి పియూష్ గోయల్ ను ఆ శాఖ నుంచి తప్పిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు.
ఇదిలా వుండగా, జైట్లీ ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై నెటిజన్లు జోకుల మీద జోకులు పేల్చుతున్నారు. ‘భారత ఆర్థిక వ్యవస్థకు ఇక గడ్డు రోజులు మొదలయ్యాయి’ అని ఒకరు వ్యాఖ్యానించగా, ‘సెస్ పురుషుడు తిరిగొచ్చాడు’ అంటూ మరొకరు వేళాకోళం చేశారు. ఇంకొన్ని రోజుల్లోనే రూపాయి.. రెండు డాలర్లకు సమానమవుతుందని వెటకారమాడారు.
మరో నెటిజన్ అయితే బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యాలకు మంచి రోజులు వచ్చేశాయని పంచ్ వేశారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-a33c3887d3d1bc5e1a86d4b7c7fdfdd4d86ba5cc.jpg)