Andhra Pradesh: ఏపీకి మరో గుడ్ న్యూస్.. రూ.17 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్.. ముందుకొచ్చిన అంతర్జాతీయ సంస్థ

  • ఏపీకి క్యూకడుతున్న పరిశ్రమలు
  • ఉక్కు పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చిన అంతర్జాతీయ సంస్థ
  • పశ్చిమలో హింద్‌వేర్
  • మిత్సుబిషి, వైకేకే సంస్థలు కూడా ఆసక్తి

నవ్యాంధ్ర సిగలో మరో అంతర్జాతీయ కంపెనీ వచ్చి చేరబోతోంది. రూ.17 వేల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు అంతర్జాతీయ సంస్థ ఒకటి ముందుకొచ్చింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఉక్కు పరిశ్రమ స్థాపనకు కడపలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న మెకన్సీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి చూపించింది. అయితే, ప్రస్తుతానికి తమ సంస్థ పేరును ఎక్కడా బయటపెట్టకూడదన్న ఆ సంస్థ షరతుతో ప్రభుత్వం ఆ సంస్థ పేరును గోప్యంగా ఉంచింది.

తాజాగా చంద్రబాబుతో భేటీ అయిన ఆ సంస్థ ప్రతినిధులు వనరుల విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. కడప సహా మరిన్ని ప్రాంతాల్లోనూ ప్లాంటు ఏర్పాటుపై ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా వారు చంద్రబాబుకు తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. కడపలో కనుక ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే రాయలసీమ ప్రాంతానికి చెందిన వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.  

మరోవైపు చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వెయ్యి కోట్ల రూపాయలతో హింద్‌వేర్ సంస్థ తన తయారీ ప్లాంట్లను స్థాపించనున్నట్టు ఆ సంస్థ ఎండీ సందీప్ సోమానీ తెలిపారు. ఈడీబీ సీఈవో కృష్ణ కిశోర్‌తో కలసి బుధవారం ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు మరో రెండు చోట్ల కూడా శానిటరీ ఉత్పత్తుల తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు.

అలాగే, ఎల్జీకెమ్ పాలిమర్స్ సంస్థ కూడా ఏపీలో విస్తరణకు సిద్ధమైంది. బుధవారం చంద్రబాబుతో సమావేశమైన ఆ సంస్థ ప్రతినిధులు త్వరలోనే పూర్తిస్థాయి ప్రతిపాదనలతో మరోమారు భేటీ అవుతామని పేర్కొన్నారు. మిత్సుబిషీ కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా వుంది. జిప్ తయారీ రంగంలో పేరెన్నికగన్న వైకేకే ప్రతినిధులు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News