Andhra Pradesh: కేంద్రం వైఖరి మారనంత వరకూ మేం మారబోం..!: గవర్నర్‌కు స్పష్టం చేసిన చంద్రబాబు
- తమ రాజకీయ వ్యూహాల్లో దాపరికం ఉండబోదన్న చంద్రబాబు
- గవర్నర్‌తో రెండు గంటలపాటు సమావేశం
- ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి
‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్’ నూతన భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన గవర్నర్ నరసింహన్‌తో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. బుధవారం రాత్రి గవర్నర్ బస చేసిన హోటల్‌కు వెళ్లిన చంద్రబాబు గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. కాగా, గవర్నర్‌తో చంద్రబాబు ముఖాముఖి భేటీ కావడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే వరకు కేంద్రంపైనా, బీజేపీపైనా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తమ రాజకీయ వ్యూహాలు, వైఖరిలో ఎలాంటి రహస్యం ఉండబోదని స్పష్టం చేసినట్టు తెలిసింది. రాష్ట్రాన్ని మోదీ ప్రభుత్వం మోసం చేసిందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందని, అందువల్లే తాము బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకున్నట్టు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. కేంద్రం తన వైఖరి మార్చుకోనంత వరకు తమ వైఖరి కూడా మారబోదని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే వైఖరి కొనసాగిస్తామని స్పష్టం చేసినట్టు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉందన్న గవర్నర్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ తమకు మాత్రం అటువంటి ఉద్దేశం లేదని చెప్పారు. తాము షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళదామనుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. ఇటీవల సంభవించిన వరదల వల్ల రాష్ట్రంలో జరిగిన ఆస్తి, పంట నష్టం వివరాలను ఈ సందర్భంగా నివేదిక రూపంలో గవర్నర్‌కు చంద్రబాబు అందించారు. అలాగే, అమరావతి బాండ్లు, వాటికి వచ్చిన స్పందన గురించి కూడా గవర్నర్‌కు వివరించినట్టు తెలుస్తోంది.