kcr: వచ్చే నెల 2న ప్రగతి నివేదన సభ.. ‘ముందస్తు’ వద్దన్న మంత్రులు!
- టీ-మంత్రులతో ముగిసిన సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ
- హైదరాబాద్ లోని కొంగర కలాన్ లో ప్రగతి నివేదన సభ
- దాదాపు 1600 ఎకరాల స్థలంలో సభ
తెలంగాణ మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం ముగిసింది. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఈరోజు సాయంత్రం ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు ఐదు గంటలకు పైగా సాగింది.
హైదరాబాద్ లోని కొంగర కలాన్ లో వచ్చే నెల 2వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రగతి నివేదన సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నలుమూలల నుంచి 25 లక్షల మంది హాజరయ్యే ఈ సభకు రేపటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని టీఆర్ఎస్ శ్రేణులను ఆదేశించారు. కాగా, కొంగర కలాన్ లో దాదాపు 1600 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే ఇందుకోసం ఎంపిక చేసినట్టు సమాచారం.
ముందస్తుకు వెళ్లకపోవడమే మంచిదన్న మంత్రులు
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా? వద్దా? అన్న దానిపై తమ మంత్రుల అభిప్రాయాన్ని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. ముందస్తుకు వెళ్లకపోవడమే మంచిదని మెజారిటీ సంఖ్యలో మంత్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారట. ముందస్తు ఎన్నికలకు వెళితే ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళతాయని మంత్రులు అభిప్రాయపడ్డారని, మంత్రుల అభిప్రాయంతో సీఎం కేసీఆర్ ఏకీభవించినట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తామని ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదని మంత్రులతో కేసీఆర్ అన్నట్టు సమాచారం.