Momo: మరో భయంకరమైన గేమ్... మోమో ఛాలెంజ్.. ఇప్పుడు భారత్ లోనూ!

  • ప్రపంచ దేశాలను వణికిస్తున్న మోమో చాలెంజ్ 
  •  అప్రమత్తంగా వుండాలంటున్న సైబర్ నిపుణులు
  •  ప్రాణాంతక టాస్కులతో బ్లాక్ మెయిలింగ్ డెత్ గేమ్ 
  • ఆట ఆడే వ్యక్తి మొబైల్ నుండి వ్యక్తిగత సమాచారం చోరీ చేసే అవకాశం

గత ఏడాది బ్లూవేల్ ఛాలెంజ్, ఇప్పుడు మోమో ఛాలెంజ్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ప్రాణాంతకమైన ఈ మోమో ఛాలెంజ్‌ ఆనవాళ్ళు భారత్ లో కూడా బయటపడ్డాయి. మొదటి నుండి సైబర్ నిపుణులు ఈ మోమో ఛాలెంజ్‌ విషయంలో అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు. దీన్ని మన దేశంలోకి రాకుండా  ప్రయత్నాలు కూడా చేశారు. అయినప్పటికీ ఈ డెత్ గేమ్ మన దేశంలోని పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిగురికి చెందిన ఒక  కాలేజ్ విద్యార్థిని వాట్సప్ కి వచ్చింది.

ఈ గేమ్ ను ఆడాలని మోమో ఛాలెంజ్‌ పంపించిన వ్యక్తి  కూడా ఆ విద్యార్థినితో మాట్లాడటంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని వ్యక్తి నుండి వచ్చిన సందేశాన్ని చూపించి ఆ నెంబర్ ను పోలీసులకు ఇచ్చిన యువతి ఫిర్యాదుతో మోమో ఛాలెంజ్‌ మన దేశంలో కూడా ప్రవేశించిందని, అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 ఇంతకీ ఈ మోమో ఛాలెంజ్‌ లో ఏముంటుంది? అంటే గతంలో బ్లూవేల్ తరహాలోనే ఈ ఛాలెంజ్ లో కూడా ప్రాణాంతకమైన టాస్క్ లు వుంటాయి. వాటిని కంప్లీట్ చేస్తూ పోతే చివరకు ఆత్మహత్య చేసుకునేలా ఈ ఛాలెంజ్ ప్రేరేపిస్తుంది. ఈ ఛాలెంజ్ వల్ల గతవారం అర్జెంటీనాకు చెందిన ఒక 12 ఏళ్ళ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఒకవేళ ఈ గేమ్ ప్రారంభించి ఆడకపోతే  వారికి భయంకరమైన చిత్రాలు, బొమ్మలు పంపుతూ భయపెడతారు. మీ వ్యక్తిగత సమాచారం, మీ వీడియోలు, ఫోటోలు మీ మొబైల్ లో ఉన్న డేటా అంతా మా చేతిలో వుంది అంటూ చెప్పిన టాస్క్ లు చెయ్యాల్సిందిగా బ్లాక్ మెయిల్ చేస్తారు. అయితే ఈ ఛాలెంజ్ విసురుతున్నవారు ఎవరు ? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? అనేవి మాత్రం అంతుపట్టకుండా వున్నాయి. అయితే ఈ ఛాలెంజ్ విసురుతున్నది మాత్రం జపాన్, మెక్సికో , కొలంబియాల నుండి వస్తున్న నంబర్స్ గా గుర్తించారు. 

 మొదట ఫేస్ బుక్  లో ప్రారంభం అయిన ఈ ఛాలెంజ్ ఇప్పుడు వాట్సప్ కి పాకింది. సోషల్ మీడియాలో యువత ప్రాణాలు హరించే ఈ బ్లాక్ మెయిలింగ్ డెత్ గేమ్ కి సంబంధించి ఒక భయంకరమైన పెద్ద కళ్ళు, వెడల్పాటి నోరు వున్న బొమ్మ వస్తుంది . ఈ బొమ్మ రూపొందించిన కంపెనీకి, ఈ గేమ్ కి సంబంధం లేదు. ఈ ఛాలెంజ్ విసురుతున్నవారు ఈ బొమ్మను ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ పెరిగాక సోషల్ మీడియాలో యువత ఎక్కువగా ఉంటున్న తరుణంలో ఇలాంటి డెత్ గేమ్ ల జోలికి పోకుండా తల్లిదండ్రుల పర్యవేక్షణ పిల్లలపై వుండాలి.

  • Loading...

More Telugu News