Pawan Kalyan: ‘జనసేన’ మేనిఫెస్టోపై విస్తృత ప్రచారం కల్పించాలి: ‘ప్యాక్’కు పవన్ కల్యాణ్ ఆదేశాలు
- పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సమావేశమయ్యాం
- ఎటువంటి వ్యూహం అనుసరించాలో చర్చించాం
- విజన్ డాక్యుమెంట్ ప్రచారంలో పార్టీ శ్రేణులు
ప్రజల మన్ననలు పొందుతున్న జనసేన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ ను ప్రజలకు మరింత చేరువుగా తీసుకెళ్లాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీ (ప్యాక్) ను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు ప్యాక్ కన్వీనర్ మాదాసు గంగాధరం ఓ ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 'ప్యాక్' సభ్యులం ఈ రోజు సమావేశమయ్యామని, ప్రచారం కోసం ఎటువంటి మాధ్యమాలను ఉపయోగించాలి, ఎటువంటి వ్యూహం అనుసరించాలి? అన్న అంశాలపై ప్యాక్ కూలంకషంగా, సుదీర్ఘంగా చర్చించిందని పేర్కొన్నారు.
దీనిపై అందుబాటులో ఉన్న పార్టీ జిల్లా కమిటీలతో చర్చించాలని, జిల్లా కమిటీల అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆమోదం కోసం పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు సమర్పించాలని ప్యాక్ తీర్మానించామని అన్నారు. మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ ప్రచారంలో పార్టీ శ్రేణులను కుడా భాగస్వామ్యుల్ని చేయాలని ప్యాక్ నిర్ణయించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
‘పన్నెండు అంశాలతో కూడిన పార్టీ విజన్ డాక్యుమెంట్ ఈ నెల 14 న పవన్ కళ్యాణ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉచిత గ్యాస్ సిలెండర్, రేషన్ కు బదులు రూ.2500 నుంచి రూ.3500, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వంటి పథకాలపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశాలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని, సెప్టెంబర్ 12 నుంచి శాసనసభ ఎన్నికల వరకు ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు’ అని మాదాసు గంగాధరం పేర్కొన్నారు.