nottingham: ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించిన టీమిండియా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీ
- నాటింగ్ హామ్ టెస్టులో సత్తా చాటిన టీమిండియా
- 203 పరుగులతో ఘన విజయం
- రెండో ఇన్నింగ్స్ లో 317 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
ఇంగ్లండ్ గడ్డపై వరుసగా రెండు టెస్టులు ఓడిపోయేసరికి ఎన్నో విమర్శలు, దెప్పిపొడుపులు. అయినా, ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. గెలవాలనే ఏకైక లక్ష్యంతో మూడో టెస్టులో బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లు... తొలి రోజు నుంచే ఇంగ్లండ్ పై పైచేయి సాధించి... చివరకు మూడో టెస్టును కైవసం చేసుకున్నారు. తద్వారా ఏ గడ్డపై అయినా సరే గెలిచే సత్తా తమకుందని చాటి చెప్పారు. నాటింగ్ హామ్ లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 203 పరుగులతో ఘన విజయం సాధించింది. దీంతో, ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.
నిన్న నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. చివరి వికెట్ తీయడానికి భారత బౌలర్లు యత్నించినప్పటికీ... సాధ్యం కాలేదు. దీంతో, ఒక వికెట్ తీయడం కోసం ఐదో రోజు బరిలోకి దిగింది ఇండియా. 30 పరుగులతో ఉన్న రషీద్, 8 పరుగులతో ఆడుతున్న అండర్సన్ బ్యాటింగ్ కు దిగారు. ఈరోజు తొలి ఓవర్ ను పాండ్యా మెయిడిన్ గా వేశాడు. రెండో ఓవర్ వేసిన షమీ 2 పరుగులు ఇచ్చాడు. మూడో ఓవర్ వేసిన అశ్విన్ ఐదో బంతికి అండర్సన్ ను ఔట్ చేశాడు. స్లిప్ లో ఉన్న రహానేకు క్యాచ్ ఇచ్చి అండర్సన్ పెవిలియన్ చేరాడు. దీంతో, 317 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది.
ఈ మ్యాచ్ లో విశ్వరూపం ప్రదర్శించిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో 97, రెండో ఇన్నింగ్స్ లో 103 పరుగులతో కోహ్లీ చెలరేగిపోయాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో పాండ్యా 5 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు.