Warangal Rural District: వరంగల్‌లో భూమిలోకి కుంగిన నాలుగంతస్తుల భవనం

  • వర్షాల కారణంగా కాజీపేటలో భూమిలోకి కుంగిన భవనం 
  •  చుట్టుపక్కల ఇళ్లలోని వారిని ఖాళీ చేయించిన అధికారులు 
  • ప్రమాదకరంగా ఉన్న భవనాన్ని కూల్చివేయనున్నట్లు ప్రకటన 
  • భవనంలో ఇరుక్కుపోయిన వాచ్‌మెన్‌  

 గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. ఈ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో చోటు చేసుకుంది. కాజీపేట పట్టణంలోని 35వ డివిజన్‌ భవానీనగర్‌ కాలనీలో నిర్మాణంలో ఉన్న జీ ప్లస్‌–4  బిల్డింగ్ మంగళవారం (ఆగస్టు 21) రాత్రి 10 గంటల సమయంలో భారీ శబ్దంతో ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. సెల్లార్, గ్రౌండ్‌ ఫ్లోర్‌ పూర్తిగా భూమిలోకి దిగబడిపోయాయి.  

 రిటైర్డ్ ఉద్యోగి కొత్త రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి జీ ప్లస్‌-4 గా కొత్త ఇంటి నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. ఏడాది నుంచి పనులు కొనసాగుతున్నాయి. కూలీలు మంగళవారం ఉదయం భవనానికి ప్లాస్టరింగ్‌ పనులు చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో భవనం ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. నాణ్యత ప్రమాణాలను పాటించని కారణంగానే భవనం భూమిలోకి కుంగిపోయి ఉంటుందని మేస్త్రీలు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వానలు కూడా ఓ కారణమని భావిస్తున్నారు . ఈ ఘటనలో దాదాపు రూ.1.50 కోట్లకుపైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ భవనానికి కాపలాగా వున్న వాచ్‌మెన్‌ భిక్షపతి భవనంలోనే ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. భిక్షపతి కోసం భార్య మణెమ్మ, ఇద్దరు పిల్లలు రోదిస్తున్నారు.  

భవనం కుంగిపోయిందనే సమాచారంతో జిల్లా అధికార యంత్రాంగం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పూర్తి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసి స్థానికులెవరూ బిల్డింగ్ వైపునకు వెళ్లకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రమాదకరంగా ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయనున్నట్టు అధికారులు తెలిపారు.

Warangal Rural District
Warangal Urban District
Telangana
  • Loading...

More Telugu News