jagan: ఎన్నికల తర్వాత జగన్, సాక్షి రెండూ కనిపించవు: యనమల జోస్యం
- అసత్యాలను ప్రచారం చేయడంలో గోబెల్స్ ను సాక్షి మించిపోయింది
- బీజేపీ, ప్రధాని కార్యాలయం చుట్టూ తిరిగింది జగన్ కాదా?
- ఎన్నికల తర్వాత ప్రధానిని నిర్ణయించేది టీడీపీనే
2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత జగన్, ఆయనకు చెందిన సాక్షి మీడియా రెండూ కనిపించవని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరనేది నిర్ణయించేది టీడీపీనే అని అన్నారు. కేవలం తన దుష్ప్రచారం కోసమే జగన్ సాక్షి మీడియాను నెలకొల్పారని చెప్పారు. అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేయడంలో గోబెల్స్ ను సాక్షి మించిపోయిందని విమర్శించారు.
దుష్ప్రచారాలతో ప్రజల్లో అపోహలను సృష్టిద్దామనుకుంటున్న జగన్ కుట్రలు ఫలించబోవని యనమల అన్నారు. బీజేపీ, ప్రధాని కార్యాలయం చుట్టూ తిరిగింది జగన్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీకి తీరని అన్యాయం చేసిన బీజేపీ పంచన చేరిన జగన్ కు... టీడీపీని, చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు కూడా లేదని అన్నారు. ఎవరి పంచనో చేరాల్సిన దుస్థితి టీడీపీకి లేదని చెప్పారు. జగన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ప్రెస్ కౌన్సిల్ దృష్టి సారించాలని కోరారు.