patient: జ్వరమొచ్చిందని ఆసుపత్రికి వెళితే.. 8 లక్షలు లాగేశారు.. ఇంకో 6 లక్షలు అడుగుతున్నారు!
- బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం
- లక్షలకు లక్షలు గుంజేస్తున్న వైనం
- ఆందోళన చేపట్టిన రోగి బంధువులు
ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకానికి ఇది మరో ఉదాహరణ. జ్వరం వచ్చిందంటూ ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ. 8 లక్షలు గుంజేశారు. అంతేకాదు, అతని ఆరోగ్య పరిస్థితి గురించి కూడా చెప్పడం లేదు. దీంతో, అతని బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే, సరూర్ నగర్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి అమర్ నాథ్ గౌడ్ (61) జ్వరంతో బాధపడుతూ ఉండగా కుటుంబసభ్యులు సదరు ప్రైవేట్ ఆసుపత్రిలో జూలై 31న చేర్పించారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచిన వైద్యులు, ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందంటూ రూమ్ కు మార్చారు. అయితే, ఆరోగ్యం మళ్లీ క్షీణించిందంటూ గత ఆదివారం ఉదయం మరోసారి ఐసీయూకు తరలించారు. అప్పటి నుంచి రోగిని చూడనివ్వకుండా, చికిత్స పేరుతో పలు పరీక్షలు, డయాలసిస్ లు చేస్తూ డబ్బులు గుంజేస్తున్నారు.
జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి డయాలసిస్ చేయడమేంటని బంధువులు నిలదీస్తే... శరీరం ఇన్ఫెక్షన్ కు గురైందంటూ వైద్యులు చెప్పారు. మంగళవారం నాడు అమర్ నాథ్ ఉంటున్న గది నుంచి దుర్వాసన వస్తున్నట్టు గుర్తించిన కుటుంబసభ్యులు బలవంతంగా లోపలకు వెళ్లి చూడగా... అతని శరీరంపై పుండ్లు కనిపించాయి. డాక్టర్లను సంప్రదించగా... బాడీ ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో, వెంటిలేటర్ పై ఉంచామని చెప్పారు.
దీంతో బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పటికే రూ. 8 లక్షలు లాగేశారని, మరో రూ. 6 లక్షలు అవుతాయని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోందని వాపోయారు. ఐసీయూలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి ముందు వారు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఆసుపత్రి యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు.