Kerala: దుబాయ్ రాజు ప్రకటించిన రూ. 700 కోట్ల సాయాన్ని నిరాకరిస్తున్న మోదీ సర్కారు!
- రూ. 700 కోట్ల భూరి విరాళం
- కేరళకు సాయం చేస్తానన్న దుబాయ్ రాజు
- గతంలో ఎన్నడూ విదేశీ సాయం తీసుకోలేదు
- ఇప్పుడూ తీసుకోబోమంటున్న కేంద్రం
కేరళలో ప్రకృతి సృష్టించిన విలయం తరువాత, 'సాయమో రామచంద్రా' అని వేడుకుంటున్న ప్రజలను ఆదుకునేందుకు ఎంతోమంది ముందుకు వస్తున్న వేళ, యూఏఈ ప్రకటించిన రూ. 700 కోట్ల భూరి విరాళాన్ని తీసుకునేందుకు మోదీ సర్కారు సుముఖంగా లేదని తెలుస్తోంది. దుబాయ్ రాజు, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యామ్ ఈ సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, యూఏఈ ప్రతిపాదించిన సాయాన్ని తీసుకోవాలని అనుకోవడం లేదని విదేశాంగ శాఖ అధికారి సయ్యద్ అక్బరుద్దీన్ వెల్లడించారు. 2007 తరువాత ఏ మల్టీ నేషనల్ సంస్థ నుంచీ ఇండియా సాయం పొందలేదని, ఇప్పుడూ అదే వర్తిస్తుందని ఆ అధికారి వ్యాఖ్యానించడం చర్చకు తెరలేపింది. ఉత్తరాఖండ్, కశ్మీర్ లను వరదలు ముంచెత్తినప్పుడు విదేశాలు ప్రతిపాదించిన సాయాన్ని భారత్ తీసుకోలేదని ఆయన గుర్తు చేయడం గమనార్హం. దుబాయ్ రాజు ప్రకటనపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది విదేశాంగ శాఖేనని ఆయన స్పష్టం చేశారు.
2013లో ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినప్పుడు రష్యా సాయాన్ని ప్రకటించగా, ఇండియా నిరాకరించిందని, ఏ అత్యవసర పరిస్థితి ఏర్పడినా, ఎటువంటి విపత్తు సంభవించినా, తనకు తానుగా సాయం చేసుకోగల స్థితిలోనే భారత్ ఉందని ఈ సందర్భంగా సయ్యద్ అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. కాగా, మాల్దీవుల ప్రభుత్వం రూ. 35 లక్షల సాయాన్ని ప్రకటించగా, ఐరాస సైతం తనవంతు తోడ్పాటును అందిస్తానని చెప్పింది. అయితే, వీటన్నింటినీ తోసిపుచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.