USA: టర్కీ ప్రజలకు కోపమొచ్చింది.. అమెరికా వస్తువులపై ప్రతాపం చూపిస్తున్నారు!
- ట్రంప్ వాణిజ్య విధానంపై టర్కీ ఆగ్రహం
- టర్కీపై ఆంక్షలు అధికం చేసి ఉక్కుపై సుంకాన్ని పెంచిన అమెరికా
- అమెరికా ఉత్పత్తులను ధ్వంసం చేసి వీడియోలు షేర్ చేస్తున్న టర్కీ యువత
టర్కీ ప్రజలు అమెరికాపై అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. అమెరికా వస్తువులైన ఐ ఫోన్లను పగలగొడుతూ, అమెరికా ఉత్పత్తులను నాశనం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలా టర్కీ ప్రజల ఆగ్రహాన్ని అమెరికా చవి చూడడానికి పెద్ద కారణమే వుంది.
నిరంకుశ వాణిజ్య విధానాన్ని అనుసరిస్తున్న ట్రంప్ టర్కీపై ఆంక్షలు పెంచడంతో పాటు ఉక్కు మీద సుంకాలను విపరీతంగా పెంచారు. దీనితో టర్కీ యువత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కోపంతో అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ తయారు చేసిన ఐఫోన్లను పగలగొడుతూ, డాలర్ నోట్లను చింపుతూ, అమెరికా ఉత్పత్తులను నాశనం చేస్తూ వీడియోలు పోస్ట్ చేసి హ్యాష్‌ట్యాగ్‌లు తగిలిస్తున్నారు.
ఇటు అమెరికాపై ఆగ్రహంతో ఉన్న టర్కీ సైతం దీటుగానే స్పందిస్తోంది. అమెరికా నుంచి టర్కీకి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌కు చాలా మంది స్థానిక ప్రజలు అమెరికా విషయంలో మద్దతుగా నిలుస్తూ ఆయన నిర్ణయాల్ని సమర్థిస్తున్నారు.